తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మున్సిపాలిటీలో మిత్రపక్షాలైన జనసేన, టీడీపీ మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. గతంలో కుదిరిన ఒప్పందాన్ని ఉల్లంఘించి, వైస్ ఛైర్మన్ పదవిని వైసీపీ సభ్యుల మద్దతుతో జనసేన కైవసం చేసుకుంది. సోమవారం జరిగిన ఎన్నికల్లో జనసేన కౌన్సిలర్ కళ్యాణ చక్రవర్తి, టీడీపీ అభ్యర్థి కొమ్మిన వెంకటేశ్వరరావుపై విజయం సాధించారు.

అంతకుముందు, జనసేనకు చెందిన మున్సిపల్ ఛైర్‌పర్సన్ మురళా జ్యోతితో పాటు 32 మంది వార్డు కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం నిర్వహించిన వైస్ ఛైర్మన్ ఎన్నికల్లో నాలుగో వార్డు కౌన్సిలర్ కళ్యాణ చక్రవర్తికి 18 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థికి 13 ఓట్లు లభించాయి. జనసేనకు చెందిన 15 మందితో పాటు బీజేపీకి చెందిన ఒకరు, వైసీపీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు చక్రవర్తికి మద్దతు తెలపడం గమనార్హం.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో మొత్తం 32 వార్డులకు గాను జనసేన 14, టీడీపీ 13, వైసీపీ 3, బీజేపీ 1, ఒక స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. ముందస్తు ఒప్పందం ప్రకారం ఛైర్మన్ పదవి జనసేనకు, వైస్ ఛైర్మన్ పదవి టీడీపీకి దక్కాల్సి ఉంది.

ఈ పరిణామాలపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి కందుల దుర్గేశ్ హామీ ఇచ్చినప్పటికీ జనసేన నేతలు మాట తప్పారని టీడీపీ సీనియర్ నాయకులు, ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ బూరుగుపల్లి శేషారావు ఆరోపించారు. ఒప్పందాన్ని గౌరవించకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని ఆయన హెచ్చరించారు. ఈ అంశాన్ని పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన పేర్కొన్నారు.

కాగా, స్వయంగా మంత్రి దుర్గేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ఇలాంటి పరిస్థితులు తలెత్తడంపై జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. దీనిపై మంత్రిని ఆయన వివరణ కోరగా, స్థానిక నేతలతో చర్చించి పార్టీ అధిష్ఠానం నిర్ణయాన్ని అమలు చేస్తానని మంత్రి స్పష్టం చేశారు. ఎన్నిక ఫలితాలు వెలువడిన అనంతరం టీడీపీకి చెందిన 13 మంది కౌన్సిలర్లు సభ నుంచి వాకౌట్ చేశారు.