ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తూ, సంక్షేమం, అభివృద్ధిని సమతుల్యంగా ముందుకు తీసుకెళుతోందని టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి పేర్కొన్నారు. అమరావతిలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.

“గత ప్రభుత్వంలో పెన్షన్లను ఏడాదికి రూ.250 చొప్పున పెంచితే, కూటమి ప్రభుత్వం రాగానే వృద్ధుల పెన్షన్‌ను ఏకంగా రూ.4,000కు పెంచి పేదలకు అండగా నిలిచింది” అని ఆమె అన్నారు. అలాగే దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్‌ను రూ.6,000కు, మంచానికే పరిమితమైన బాధితులు, కిడ్నీ, తలసేమియా రోగులకు అందించే మొత్తాన్ని రూ.15,000కు పెంచి ఆయా కుటుంబాలను ఆదుకుంటున్నామని వివరించారు.

రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ కోసం ప్రభుత్వం రాబోయే ఐదేళ్ల కాలంలో సుమారు రూ.1.70 లక్షల కోట్లు ఖర్చు చేయనుందని మాధవి వెల్లడించారు. గత ప్రభుత్వం పెన్షన్లను రాజకీయ లబ్ధి కోసం వాడుకుందని ఆరోపిస్తూ, ప్రస్తుత ప్రభుత్వం రాజకీయాలతో సంబంధం లేకుండా కేవలం అర్హతనే ప్రాతిపదికగా తీసుకుని లబ్ధిదారులకు సంక్షేమం అందిస్తోందని స్పష్టం చేశారు. 

“పెన్షన్‌ను ఓట్ల కోసం ఇచ్చే తాయిలంగా కాకుండా పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా మార్చిన ఘనత చంద్రబాబుదే” అని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆరోగ్య భద్రత కల్పించే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సంజీవని పథకాన్ని ముందుకు తెస్తున్నారని మాధవి తెలిపారు.