విజయవాడ నగర మున్సిపల్ కార్పొరేషన్ (వీఎంసీ) నూతన మేయర్‌గా జనసేన పార్టీ నేత వంగవీటి రాధాకృష్ణ ప్రమాణ స్వీకారం చేశారు. నగరంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో ఈ ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశా తొలుత మేయర్ వంగవీటి రాధాకృష్ణతో ప్రమాణం చేయించారు. అనంతరం నగరంలోని 86 మంది కార్పొరేటర్లు వరుసగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ ప్రమాణస్వీకారం ముగిసిన వెంటనే డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహించారు. ఇందులో భాగంగా చెన్నుపాటి కాంతిశ్రీని సభ్యులు డిప్యూటీ మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీశా ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించి ఎన్నిక ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.

ఈ కార్యక్రమానికి విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ... ప్రజల ఆదరణతో కూటమి ఘన విజయం సాధించిందని అన్నారు. విజయవాడలో మొదట మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణ, ఆ తర్వాత కార్పొరేటర్లు ప్రమాణం చేశారని తెలిపారు. డిప్యూటీ మేయర్‌గా చెన్నుపాటి కాంతిశ్రీని అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని చెప్పారు. ఇంతటి భారీ విజయం వెనుక కూటమి నేతలు, కార్యకర్తల కృషి ఎంతో ఉందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేతృత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసే ప్రజలు కూటమిని ఆశీర్వదించారని వివరించారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయవాడ కార్పొరేషన్‌లోని 86 డివిజన్లకు గాను కూటమి ఏకంగా 76 స్థానాలను గెలుచుకుంది. ఇందులో టీడీపీ 53, జనసేన 19, బీజేపీ 4 స్థానాలు సాధించాయి. నూతన పాలకవర్గం బాధ్యతలు స్వీకరించడంతో విజయవాడ నగరంలో కొత్త పాలన అధికారికంగా ప్రారంభమైంది.