వైద్యారోగ్యం నుంచి వ్యవసాయం వరకు అన్ని కీలక రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతను విస్తృతంగా వినియోగించుకుని పాలనలో మెరుగైన ఫలితాలు సాధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అమరావతిలో రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజీఎస్)పై వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఏఐ స్టాక్ సాయంతో ప్రభుత్వ సేవలను మరింత సులభతరం చేయడంతో పాటు, ఆయా శాఖల పనితీరును, ప్రభుత్వ ఆదాయాలను మెరుగుపర్చాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

పాలనా విభాగాల్లో రెవెన్యూ, లీగల్ ఏఐ స్టాక్ ద్వారా వివిధ అంశాలను విశ్లేషించి, అత్యుత్తమ ఫలితాలు రాబట్టేలా చర్యలు తీసుకుంటున్నామని సీఎం వివరించారు. రాబోయే రోజుల్లో డేటా ఆధారిత నిర్ణయాలు (డేటా డ్రివెన్ డెసిషన్ మేకింగ్) అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటాయని స్పష్టం చేశారు. ప్రభుత్వ సమర్థ పనితీరుకు ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలే నిదర్శనమని గుర్తుచేశారు.

ప్రభుత్వ శాఖలు ప్రజలకు అందించే వివిధ పౌర సేవలను మరింత సమర్థవంతంగా, వేగంగా చేరవేయడానికి తగిన కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఉద్యోగుల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు కెపాసిటీ బిల్డింగ్ కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ సేవలపై ప్రజల్లో సంతృప్తికరమైన సానుకూల అభిప్రాయం ఏర్పడినప్పుడే సుపరిపాలన సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు.

పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ ద్వారా ప్రజల నుంచి అందే అర్జీలు, ఫిర్యాదులను ఏమాత్రం జాప్యం లేకుండా వేగంగా పరిష్కరించాలని సీఎం అధికారులకు తేల్చిచెప్పారు. ప్రజా సమస్యల పరిష్కార ప్రక్రియలో పర్యవేక్షణ లోపాలు ఉంటే వెంటనే సరిదిద్దుకోవాలని, ప్రతి శాఖ కూడా తన పనితీరును నిరంతరం సమీక్షించుకోవాలని ఆదేశించారు.

ఈ సమీక్షా సమావేశంలో సాంఘిక సంక్షేమ, బీసీ సంక్షేమ, మైనారిటీ సంక్షేమ, ఆర్థిక, పురపాలక, ఇంధన శాఖల ఉన్నతాధికారులు మరియు ఆర్టీజీఎస్ ప్రతినిధులు పాల్గొన్నారు.