తిరుపతి జిల్లా రేణిగుంట మండలం ఆంజనేయపురంలోని అభయ ఆంజనేయ స్వామి ఆలయ పాత కట్టడం తొలగింపు వ్యవహారంపై కూటమి ప్రభుత్వం, వైసీపీ మధ్య తీవ్ర స్థాయి వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. కడప-రేణిగుంట జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా ఈ పురాతన ఆలయాన్ని కూల్చివేశారంటూ వైసీపీ ఆరోపించగా... విగ్రహాలను శాస్త్రోక్తంగా కొత్త ప్రాంగణంలోకి మార్చిన అనంతరమే పాత నిర్మాణాన్ని తొలగించినట్లు ఆలయ పూజారి, దేవాదాయ శాఖ స్పష్టం చేశాయి.

ఆలయ కూల్చివేతను ఖండిస్తూ వైసీపీ అధినేత జగన్ ‘ఎక్స్’ వేదికగా విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వంలో పురాతన ఆలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయడం భక్తుల విశ్వాసాలను దెబ్బతీయడమేనని ఆరోపించారు. టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్థానికంగా నిరసన తెలుపుతూ రహదారి అలైన్‌మెంట్‌ను మార్చే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని పేర్కొన్నారు.

మరోవైపు, వైఎస్సార్సీపీ చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ తమ అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో ఆలయ పూజారి మాట్లాడిన వీడియోను పోస్ట్ చేసింది. అందులో పూజారి మాట్లాడుతూ, గ్రామస్థులు, భక్తులు, దేవాదాయ శాఖ అధికారుల పూర్తి సమ్మతితోనే పూజలు జరిపి విగ్రహాలను పక్కనే నిర్మించిన కొత్త ఆలయంలోకి ప్రతిష్ఠించామని తెలిపారు. ఆ తర్వాతే పాత కట్టడాలను తొలగించారని, భక్తులు తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఈ వివాదంపై ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, సంబంధిత అధికారులు వివరణ ఇచ్చారు. జాతీయ రహదారి నాలుగు లేన్ల విస్తరణ కోసం ఆలయానికి చెందిన 10 సెంట్ల స్థలాన్ని సేకరించే ప్రక్రియ 2023లో గత ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమైందని అధికారులు వెల్లడించారు. ఆలయానికి ప్రత్యామ్నాయంగా సమీపంలోనే 50 సెంట్ల భూమిని కేటాయించామని, అలాగే రూ.59.30 లక్షల పరిహారాన్ని 2026 ఆగస్టు 1వ తేదీన ఆలయ ఈవో ఖాతాలో జమ చేశామని దేవాదాయ శాఖ స్పష్టం చేసింది.