కాకినాడ జిల్లా నుంచి వేటకు వెళ్లి గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు సురక్షితంగా ఉన్నారని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించారు. వారి బోటు ఇంజన్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో సముద్రంలో చిక్కుకుపోయారని, అయితే ప్రస్తుతం వారంతా క్షేమంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.

వివరాల్లోకి వెళితే.. కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం సుబ్బంపేట గ్రామానికి చెందిన ఏడుగురు మత్స్యకారులు నవంబర్ 19న వేటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో వారి కుటుంబ సభ్యులతో సంబంధాలు తెగిపోయాయి. ఉప్పాడ, తుని మధ్యలో ఉన్న కృష్ణాపురం తీరానికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో వారి బోటు నిలిచిపోయినట్లు అధికారులు గుర్తించారు.

సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన ఇండియన్ కోస్ట్ గార్డ్, ఇండియన్ నేవీ హెలికాప్టర్లు, నౌకలతో పారాదీప్ తీర ప్రాంతంలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. మత్స్యకారుల ఆచూకీ కనుగొనడంలో సకాలంలో స్పందించి సహాయం అందించిన కోస్ట్ గార్డ్, నేవీ సిబ్బందికి మంత్రి అచ్చెన్నాయుడు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రస్తుతం మత్స్యకారులను, వారి బోటును సురక్షితంగా తీరానికి చేర్చేందుకు మరో బోటు సహాయంతో ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి వివరించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, మత్స్యకారుల కుటుంబాలు ఆందోళన చెందవద్దని ఆయన భరోసా ఇచ్చారు.