గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం పూర్తిగా నిర్వీర్యమైందని, కూలీల హక్కులను కాలరాశారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. గత ఐదేళ్ల పాలనలో ఉపాధి హామీని నిర్లక్ష్యం చేసి, అవినీతికి వేదికగా మార్చిన వారు ఇప్పుడు కూలీల గురించి మాట్లాడటం సమంజసం కాదని ఆయన పేర్కొన్నారు.

2020-21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో 94.89 లక్షలుగా ఉన్న జాబ్‌కార్డులను సాంకేతిక సమస్యలు, ఆధార్ అనుసంధానం వంటి కారణాలు చూపి 2023-24 నాటికి 67.71 లక్షలకు తగ్గించారని తెలిపారు. దీనివల్ల దాదాపు 20.05 లక్షల కుటుంబాలు ఉపాధి హామీ పథకానికి దూరమయ్యాయని వివరించారు. జాతీయ స్థాయిలో జాబ్‌కార్డుల తొలగింపు సగటు 11 శాతంగా ఉంటే, ఆంధ్రప్రదేశ్‌లో ఏకంగా 24.6 శాతం కార్డులను తొలగించారని మానవ హక్కుల వేదిక ప్రతినిధుల నివేదికలను ప్రస్తావిస్తూ కోటంరెడ్డి పేర్కొన్నారు.

అలాగే, 2022-23 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనం ప్రకారం ఒక్కో కూలీకి ఏటా రూ.13,433 అందాల్సి ఉండగా, కేవలం రూ.11,058 మాత్రమే చెల్లించారని, దీనివల్ల ఒక్కో కూలీ సుమారు రూ.2,380 నష్టపోయారని కోటంరెడ్డి తెలిపారు. ఈ రకంగా గత ఐదేళ్ల కాలంలో పనులకు హాజరైన కూలీలు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ.5,000 కోట్ల మేర నష్టపోయినట్లు లిబ్‌టెక్ ఇండియా అధ్యయనాలు స్పష్టం చేశాయని ఆయన వివరించారు.

వీటికి తోడు మెటీరియల్ కాంపోనెంట్‌తో కలిపి రూ.800 కోట్ల బకాయిలు పెండింగ్‌లో పెట్టారని విమర్శించారు. దొంగ మస్టర్ల ద్వారా సుమారు రూ.1,300 కోట్ల నిధులు పక్కదారి పట్టాయని జాతీయ స్థాయి మానిటరింగ్ బృందం గుర్తించిందని, ఉపాధి హామీ నిధుల దుర్వినియోగంలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని గతంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో వెల్లడించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

మరోవైపు, కేంద్ర ప్రభుత్వం 2025లో అమల్లోకి తెచ్చిన 'వికసిత్ భారత్ – రోజ్‌గార్, అజీవిక మిషన్ (గ్రామీన్)' లేదా 'విబి-జీ-రామ్‌జీ' పథకం గ్రామీణ ప్రాంత శ్రామికులకు ఎంతో ప్రయోజనకరంగా మారిందని కోటంరెడ్డి పేర్కొన్నారు. గతంలో ఉపాధి హామీ కింద ఏడాదికి 100 రోజులు మాత్రమే పని కల్పించేవారని, ప్రస్తుత పథకంలో పనిదినాలను 125 రోజులకు పెంచారని తెలిపారు. రాష్ట్రంలో రోజువారీ సగటు వేతనం రూ.307 ప్రకారం లెక్కిస్తే, అదనంగా లభించే 25 రోజుల పని ద్వారా ప్రతి కూలీకి ఏడాదికి రూ.7,675 వరకు అదనపు ఆదాయం సమకూరుతుందని ఆయన వివరించారు. 

గ్రామీణ ప్రాంత పేదలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ, మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఆయన స్పష్టం చేశారు.