ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న 'పెట్టుబడుల రక్షణ చట్టం' (ఇన్వెస్ట్‌మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్) బిల్లును సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ సమావేశాలు దాదాపు 15 రోజుల పాటు కొనసాగవచ్చని తెలుస్తోంది.

రాష్ట్రానికి వచ్చే పారిశ్రామిక పెట్టుబడులకు రాజకీయ మార్పులతో సంబంధం లేకుండా చట్టపరమైన భరోసా కల్పించడమే ఈ నూతన చట్టం ప్రధాన ఉద్దేశం. రాష్ట్రంలో అధికారం మారినప్పుడు... పరిశ్రమలకు అందించే ప్రోత్సాహకాలు, భూ కేటాయింపుల విషయంలో భవిష్యత్తులో విధానపరమైన ఆకస్మిక మార్పులు జరగకుండా నిరోధించేందుకు ఈ బిల్లును రూపొందిస్తున్నారు. దేశంలోనే తొలిసారిగా ఈ తరహా చట్టాన్ని తీసుకొస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు.

ఇటీవల విశాఖపట్నంలో నిర్వహించిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో రికార్డు స్థాయిలో దాదాపు రూ. 9.89 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు కుదిరాయి. ఈ నేపథ్యంలో పారిశ్రామికవేత్తల్లో మరింత నమ్మకాన్ని పెంచేందుకు ఈ చట్టాన్ని వేగంగా తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

ఈ విషయమై మంత్రి లోకేశ్ మాట్లాడుతూ... "చాలా మంది పెట్టుబడిదారులు దీనిపై మమ్మల్ని అడిగారు. ప్రభుత్వం దీనిపై తీవ్రంగా ఆలోచిస్తోంది, ఖచ్చితంగా చట్టం తెస్తాం" అని పేర్కొన్నారు.

మరోవైపు రాష్ట్రంలోని కీలక సాగునీటి ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితి, నిర్మాణ పనుల పురోగతి, భవిష్యత్ కార్యాచరణ వంటి అంశాలపై కూడా ఈ అసెంబ్లీ సమావేశాల్లో సమగ్రంగా చర్చించనున్నారు.