ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు అమరావతిలో రెండు కీలక సమావేశాలకు అధ్యక్షత వహించనున్నారు. రాష్ట్రానికి నూతన పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడం, రాజధాని అమరావతి అభివృద్ధి పనులను వేగవంతం చేయడమే ప్రధాన ఎజెండాగా ఈ భేటీలు జరగనున్నాయి.

ముఖ్యమంత్రి అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్‌ఐపీబీ), రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) సమావేశాలు వేర్వేరుగా నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది.

ఇందులో భాగంగా ఉదయం 11 గంటలకు ఎస్‌ఐపీబీ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించడం, భారీగా నూతన పెట్టుబడులను తీసుకురావడంపై ఈ భేటీలో విస్తృతంగా చర్చించనున్నారు. ప్రభుత్వం అమలు చేయాల్సిన ప్రోత్సాహకాలు, పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతుల ప్రక్రియపై ఈ సమావేశంలో సమీక్షించనున్నారు.

అనంతరం మధ్యాహ్నం 2.45 గంటలకు సీఆర్‌డీఏ సమావేశం ప్రారంభం కానుంది. అమరావతి రాజధాని పరిధిలో ప్రస్తుతం జరుగుతున్న వివిధ నిర్మాణ పనుల పురోగతిని సీఎం స్వయంగా సమీక్షిస్తారు. దీంతో పాటు రాజధానిలో చేపట్టాల్సిన కొత్త అభివృద్ధి ప్రాజెక్టుల ప్రతిపాదనలు కూడా ఈ భేటీలో చర్చకు రానున్నాయి.