రెండు కాళ్లు సరిగా లేకపోయినా ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేసిన మనోహర్ అనే దివ్యాంగ బాలుడి ప్రతిభ ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్‌ను విశేషంగా ఆకర్షించింది. మనోహర్ డ్యాన్స్ చేసిన వీడియోను మంత్రి నారా లోకేశ్ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంటూ, ఆ బాలుడి అచంచల సంకల్పాన్ని మనస్ఫూర్తిగా అభినందించారు.

సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆ వీడియోలో మనోహర్ అంతర్జాతీయ గుర్తింపు పొందిన ‘నాటు నాటు’ పాటకు ఉత్సాహంగా స్టెప్పులు వేశాడు. కాళ్లు లేవన్న భావన ఏమాత్రం కనిపించకుండా, ముఖంలో చిరునవ్వుతో అతను చేసిన డ్యాన్స్ ప్రతి ఒక్కరినీ కదిలించింది. ఈ వీడియోపై స్పందించిన నారా లోకేశ్.. "నీ సంకల్పానికి ఆ విధి సైతం చప్పట్లు కొట్టి అభినందించాల్సిందే మనోహర్. నీ ఆత్మవిశ్వాసం ఓ అద్భుతం. సోషల్ మీడియాలో నీ డ్యాన్స్ వీడియో చూసి వివరాలు తెలుసుకున్నాను" అని పేర్కొన్నారు.

అంతేకాకుండా, మనోహర్ కేవలం నృత్యానికే పరిమితం కాకుండా షాట్‌పుట్ అథ్లెట్‌గా రాణిస్తున్నాడని, అద్భుతంగా పాటలు కూడా పాడతాడని తెలుసుకుని లోకేశ్ మరింత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఎదుగుతున్న ఆ బాలుడి పట్టుదలను ఆయన కొనియాడారు.

ఇదే క్రమంలో గ్రామీణాభివృద్ధి ట్రస్ట్ (ఆర్డీటీ) సంస్థ చేస్తున్న సేవలను కూడా మంత్రి ప్రస్తావించారు. ఆర్డీటీ సంస్థలో మనోహర్ లాంటి వందలాది మంది దివ్యాంగులకు నైతిక విలువలతో కూడిన విద్య, క్రీడలు, అలాగే జీవన నైపుణ్యాలు నేర్పిస్తున్నారని తెలిసి ఎంతో సంతోషం కలిగిందని తెలిపారు. శారీరక పరిమితులను అధిగమించి ఆకాశమే హద్దుగా ముందుకు సాగుతున్న ఇలాంటి బాలబాలికలు సమాజ భవిష్యత్తుకు వెలుగు దీపికలని, నిండైన ఆత్మవిశ్వాసానికి అసలైన ప్రతీకలని ఆయన కొనియాడారు. వారి ప్రతిభ అనన్య సామాన్యమని పేర్కొంటూ, చిన్నారులందరికీ తన హృదయపూర్వక అభినందనలు, ఆశీస్సులు అందజేశారు. లోకేశ్ పంచుకున్న ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట విపరీతంగా ఆకట్టుకుంటోంది.