అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన పలువురు దిగ్గజ ఆటగాళ్లు మరోసారి మైదానంలో సందడి చేయనున్నారు. కెన్యాలోని నైరోబీ వేదికగా డిసెంబర్ 3 నుంచి 'సూపర్ 90' నాలుగో సీజన్ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. వెస్టిండీస్ విధ్వంసక వీరుడు క్రిస్ గేల్, బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకిబ్ అల్ హసన్, అంబటి రాయుడు వంటి స్టార్ ఆటగాళ్లు ఈ టోర్నీలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు.

మొత్తం 12 రోజుల పాటు సాగే ఈ టోర్నీలో 7 ఫ్రాంచైజీలు తలపడనున్నాయి. పంజాబ్ టైటాన్స్ తరఫున క్రిస్ గేల్ బరిలోకి దిగుతుండగా, లండన్ జెయింట్స్ జట్టుకు షకిబ్ ఆడనున్నాడు. ఇంగ్లండ్‌కు చెందిన జేసన్ రాయ్ (మెరు థండర్స్), అలెక్స్ హేల్స్ (నైరోబీ లయన్స్) కూడా ఈ లీగ్‌లో పాలుపంచుకుంటున్నారు. వీరితో పాటు శ్రీలంక మాజీ కెప్టెన్ తిలకరత్నే దిల్షాన్, ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ షాన్ మార్ష్, వెస్టిండీస్ ఆల్‌రౌండర్లు ఫాబియన్ అలెన్, కార్లోస్ బ్రాత్‌వైట్ వంటి ప్రముఖులు వివిధ జట్లకు ప్రాతినిధ్యం వహించనున్నారు.

డిసెంబర్ 3న నైరోబీ జింఖానా క్రికెట్ క్లబ్‌లో పంజాబ్ టైటాన్స్, ఢిల్లీ రాయల్స్ మధ్య జరిగే మ్యాచ్‌తో టోర్నీ మొదలవుతుంది. ఈ టోర్నీలో మొత్తం 22 మ్యాచ్‌లు జరగనుండగా, డిసెంబర్ 14న ఫైనల్ నిర్వహిస్తారు. భారత కాలమానం ప్రకారం మ్యాచ్‌లు ప్రతిరోజూ మధ్యాహ్నం 2:00 గంటలకు, సాయంత్రం 5:00 గంటలకు ప్రారంభమవుతాయి.

హర్యానా వారియర్స్, పంజాబ్ టైటాన్స్, నైరోబీ లయన్స్, మెరు థండర్స్, ఎల్డోరెట్ టైగర్స్, ఢిల్లీ రాయల్స్, లండన్ జెయింట్స్ అనే ఏడు ఫ్రాంచైజీలతో ఈ టోర్నీ రసవత్తరంగా సాగనుంది. అంతర్జాతీయ ఆటగాళ్లతో పాటు స్థానిక కెన్యా క్రికెటర్లను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా దేశంలో క్రికెట్‌కు ఆదరణ పెంచడమే ఈ టోర్నీ ముఖ్య ఉద్దేశం.