ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సముద్ర వాణిజ్యం, పారిశ్రామిక రంగానికి ప్రధాన గేట్‌వేగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. విశాఖపట్నంలో ఇండియా ఫౌండేషన్, కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహించిన ‘ఆసియాన్-ఇండియా మారిటైమ్ సదస్సు’లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సముద్ర మార్గాల అనుసంధానత, సాంకేతికత, క్లీన్ ఎనర్జీ, నైపుణ్యాభివృద్ధి వంటి రంగాల్లో ఆగ్నేయాసియా దేశాలతో ఆంధ్రప్రదేశ్ బలమైన, దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని కోరుకుంటోందని ఆయన తెలిపారు.

విశాఖపట్నానికి గొప్ప సముద్ర చరిత్ర ఉందని, ఈ నగరం తూర్పు నౌకా దళానికి (ఈస్టర్న్ నేవల్ కమాండ్) ప్రధాన కేంద్రంగా ఉండటంతో పాటు శరవేగంగా ఐటీ, వాణిజ్య కేంద్రంగా ఎదుగుతోందని లోకేశ్ పేర్కొన్నారు. దేశంలోనే రెండో అతిపెద్ద తీరప్రాంతం (దాదాపు 1,053 కిలోమీటర్లు) కలిగిన ఆంధ్రప్రదేశ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో అంతర్జాతీయ స్థాయి లాజిస్టిక్స్, ఇండస్ట్రియల్ హబ్‌గా మార్చేందుకు పటిష్ఠమైన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. గత ఆర్థిక సంవత్సరంలో విశాఖపట్నం పోర్టు 91.17 మిలియన్ టన్నుల కార్గోను నిర్వహించి దాదాపు 10 శాతం వృద్ధితో సరికొత్త రికార్డు సృష్టించిందని ఆయన గుర్తుచేశారు.

రాష్ట్రంలో సముద్ర రవాణా మౌలిక వసతులను బలోపేతం చేసేందుకు రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం, కాకినాడలలో నాలుగు కొత్త పోర్టుల నిర్మాణం వేగంగా జరుగుతోందని లోకేశ్ తెలిపారు. ఈ పోర్టులు ఏపీతో పాటు పొరుగు రాష్ట్రాల పారిశ్రామిక అవసరాలకు ఎంతో దోహదపడతాయని అన్నారు. అలాగే తిరుపతి జిల్లా దుగరాజపట్నంలో దాదాపు రూ. 30,000 కోట్ల భారీ పెట్టుబడితో ప్రధాన షిప్‌బిల్డింగ్ (నౌకా నిర్మాణ) క్లస్టర్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు వెల్లడించారు. 

ఇటీవల కాలంలోనే విశాఖ కేంద్రంగా పోర్టుల విస్తరణ, లాజిస్టిక్స్, ప్రత్యేక టెర్మినల్స్, షిప్ రిపేరింగ్ రంగాల్లో రూ. 7,500 కోట్ల విలువైన అవగాహన ఒప్పందాలు (MoUs) కుదిరాయని తెలిపారు. పోర్టులను పరిశ్రమలతో అనుసంధానించడం, తద్వారా ఆ పరిశ్రమల ఉత్పత్తులను గ్లోబల్ మార్కెట్లకు చేర్చడమే తమ వ్యూహమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ విధానాలను లోకేశ్ ప్రస్తావించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం బ్లూ ఎకానమీకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని కొనియాడారు. సాగరమాల, మారిటైమ్ ఇండియా విజన్ 2030, మారిటైమ్ అమృత్ కాల్ విజన్ 2047 వంటి బృహత్తర కార్యక్రమాలు దేశ ప్రగతికి బాటలు వేస్తున్నాయని చెప్పారు. 

నౌకా నిర్మాణ రంగాన్ని బలోపేతం చేసేందుకు కేంద్ర కేబినెట్ రూ. 25,000 కోట్ల డెవలప్‌మెంట్ ఫండ్‌తో కలిపి మొత్తం రూ. 70,000 కోట్ల భారీ ప్యాకేజీని ఆమోదించిందని గుర్తుచేశారు. దేశీయ వాణిజ్యంలో 95 శాతం సరుకు రవాణా సముద్ర మార్గం ద్వారానే జరుగుతున్నందున, అత్యాధునిక పోర్టుల నిర్మాణం ద్వారా వ్యాపార, పారిశ్రామిక రంగాలకు, ముఖ్యంగా యువత ఉపాధికి విస్తృత అవకాశాలు లభిస్తాయని లోకేశ్ స్పష్టం చేశారు.