కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి ఇటీవల సొంత పార్టీపై చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. పార్టీ లైన్ దాటి మాట్లాడే నేతలపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అంశాన్ని అధిష్ఠానం చూసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, పార్టీ అంతర్గత వ్యవహారాలపై ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు.

“కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్యం కొంచెం ఎక్కువైంది. పార్టీ లైన్‌ దాటి మాట్లాడే వారిపై క్రమశిక్షణ చర్యల గురించి ఏఐసీసీ చూసుకుంటుంది. ఎమ్మెల్యేలు రాజగోపాల్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డి వ్యాఖ్యలను ఏఐసీసీ నిశితంగా పరిశీలిస్తోంది” అని తెలిపారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ బలంగా ఉందంటూ చేసిన వ్యాఖ్యలు, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ప్రభుత్వ స్థిరత్వం, పనితీరుపై మాట్లాడిన అంశాలు పార్టీలో తీవ్ర చర్చకు దారితీసిన నేపథ్యంలో పీసీసీ చీఫ్ ఈ వివరణ ఇచ్చారు.

ఈ సందర్భంగా క్రమశిక్షణ ప్రాధాన్యతను వివరిస్తూ ఆయన గత ఉదంతాన్ని గుర్తుచేశారు. “గతంలో కొండా సురేఖ విషయంలోనూ మొదటిసారే చర్యలు తీసుకోలేదు. పలుమార్లు హెచ్చరించాం. తీరు మారకపోవడంతోనే చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. క్రమశిక్షణ ముందు అందరూ సమానమే. దేనికైనా సరైన సమయం ఉంటుంది” అని స్పష్టం చేశారు. పార్టీలో ప్రతి ఒక్కరూ నిబంధనలకు కట్టుబడి ఉండాలని, ఎవరైనా పరిధి దాటి ప్రవర్తిస్తే అధిష్ఠానం తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు.