తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా నాగర్‌కోయిల్ రైల్వే యార్డులో దారుణమైన ఘటన వెలుగుచూసింది. యార్డులో నిలిపి ఉంచిన ఒక ఖాళీ రైలు బోగీలో 54 ఏళ్ల మహిళపై లైంగిక దాడికి పాల్పడి, ఆపై ఆమెను దారుణంగా హత్య చేసిన ఉదంతం తీవ్ర కలకలం రేపింది. ఈ కేసును దర్యాప్తు ప్రారంభించిన కేవలం 6 గంటల వ్యవధిలోనే రైల్వే పోలీసులు ఛేదించి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

నవంబర్ 13వ తేదీ అర్ధరాత్రి సమయంలో ఈ ఘాతుకం చోటుచేసుకుంది. యార్డులో నిరుపయోగంగా పడి ఉన్న బోగీని తిరిగి సర్వీసులోకి తీసుకురావడానికి రైల్వే సిబ్బంది శుభ్రం చేస్తుండగా మహిళ మృతదేహం బయటపడింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రాథమికంగా మహిళ వద్ద ఎలాంటి ఆధారాలు లేదా గుర్తింపు కార్డులు లభించకపోవడంతో ఆమె వివరాలు తెలుసుకోవడం పోలీసులకు పెను సవాలుగా మారింది.

అయితే, ఆమె చేతికి ఉన్న పాము ఆకారపు బంగారు ఉంగరం ఈ కేసులో కీలక ఆధారంగా నిలిచింది. ఆ ఉంగరంపై ఉన్న హాల్‌మార్క్ వివరాలను పరిశీలించిన పోలీసులు, అది గుజరాత్‌లోని ఒక ఆభరణాల తయారీదారుడి వద్ద రూపొందినట్లు గుర్తించారు. అక్కడి నుంచి దర్యాప్తును ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఉన్న ఒక రిటైల్ దుకాణానికి విస్తరించారు. ఆ దుకాణంలోని విక్రయాల రికార్డులను పరిశీలించగా, ఆభరణం కొనుగోలు చేసిన సమయంలో బాధితురాలు ఇచ్చిన పాన్ వివరాలు, మధ్యప్రదేశ్ చిరునామా లభ్యమయ్యాయి. ఆ వివరాల ఆధారంగా పోలీసులు కుటుంబ సభ్యులను సంప్రదించగా, ఆమె గత 3 నెలలుగా కనిపించకుండా పోయినట్లు తెలిసింది. దీంతో ఆమె భర్త, పిల్లలు కన్యాకుమారికి బయలుదేరారు.

మరోవైపు రైల్వే ఎస్పీ ఆదర్శ్ పచేరా పర్యవేక్షణలో హత్య కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగింది. రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలించగా, తెల్లటి చొక్కా ధరించిన ఒక వ్యక్తి అనుమానాస్పదంగా ఆ బోగీ నుంచి బయటకు రావడం కనిపించింది. ఆ దృశ్యాల ఆధారంగా అతడిని ప్లాట్‌ఫామ్‌పై తిరిగే ఒక యాచకుడిగా గుర్తించారు. అంతకుముందు కూడా అతడు ఆ మహిళతో మాట్లాడినట్లు తేలింది.

అనుమానితుడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా నేరాన్ని అంగీకరించాడు. మహిళను నిర్మానుష్యంగా ఉన్న బోగీలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డానని, ఆ తర్వాత ఆమెను చేతులతో కొట్టి, ఛాతీపై కాళ్లతో బలంగా తన్ని చంపినట్లు వెల్లడించాడు. ఈ హత్యకు ఎలాంటి ఆయుధాలనూ ఉపయోగించలేదని తేలింది. అతడు పారేసిన రక్తపు మరకలు ఉన్న చొక్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

బాధితురాలి మృతదేహానికి నిర్వహించిన ప్రాథమిక పోస్ట్‌మార్టం నివేదికలో ఆమె పక్కటెముకలు తీవ్రంగా విరిగిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదైన అతి తక్కువ సమయంలోనే, సాంకేతికత ఉపయోగించి, చాకచక్యంతో నిందితుడిని పట్టుకున్న రైల్వే పోలీసు బృందాన్ని తమిళనాడు రైల్వే డీజీపీ కె. వన్నియ పెరుమాళ్ ప్రత్యేకంగా అభినందించారు.