కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ పీఠం వ్యవహారంలో తీవ్ర అసంతృప్తికి గురైన బీజేపీ సీనియర్ నేత ఆదినారాయణ రెడ్డి ఎట్టకేలకు మెట్టుదిగారు. సీఎం చంద్రబాబు నాయుడుతో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన సమావేశం అనంతరం ఆయన శాంతించినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో తగిన ప్రాధాన్యత కల్పిస్తామని సీఎం నుంచి కీలక హామీ లభించడంతో ఈ వివాదం ప్రస్తుతానికి సద్దుమణిగింది.

కూటమిలో భాగంగా కడప జెడ్పీ ఛైర్మన్ పదవిని తన సోదరుడి కుమారుడికి కేటాయిస్తారని ఆశించిన ఆదినారాయణ రెడ్డికి భంగపాటు ఎదురైంది. పొత్తులో భాగంగా ఆ సీటును టీడీపీ నేత పుత్తా నరసింహారెడ్డికి కేటాయించడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట ఇచ్చి తప్పారని, ఇది తనకు తీవ్ర అవమానమని ఆయన బహిరంగంగానే వ్యాఖ్యానించారు.

ఈ పరిణామంతో తీవ్రంగా నొచ్చుకున్న ఆదినారాయణ రెడ్డి, తన సోదరుల కుమారులు చదిపిరాళ్ల రాజేశ్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డిలతో కలిసి రాజీనామాలకు సిద్ధమయ్యారు. ఈ మేరకు విజయవాడకు చేరుకొని తమ అసంతృప్తిని తెలియజేశారు. దీంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌, ఇతర నేతలు రంగంలోకి దిగి ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. 

పొత్తు ధర్మంలో భాగంగానే ఈ నిర్ణయం జరిగిందని, రాజీనామా వంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. అయినప్పటికీ ఆయన వెనక్కి తగ్గలేదు. బీజేపీ జాతీయ నాయకత్వంతో చర్చించాకే తన తుది నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. పరిస్థితి తీవ్రతను గమనించిన కూటమి పెద్దలు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌తో కలిసి ఆదినారాయణ రెడ్డిని ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ చంద్రబాబుతో ఆయన భేటీ అయ్యారు. 

కడప జిల్లాలో, ముఖ్యంగా పులివెందులలో సైతం కూటమి గెలుపు కోసం తాను ఎంతో కష్టపడ్డానని, అయినా తనకు సరైన గుర్తింపు లభించలేదని సీఎం వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆదినారాయణ రెడ్డి వాదనను విన్న చంద్రబాబు, సీట్ల సర్దుబాటులో కొన్ని తప్పనిసరి పరిస్థితులు ఏర్పడ్డాయని వివరించారు. ఆయన సేవలను కూటమి ప్రభుత్వం తప్పకుండా గుర్తిస్తుందని, భవిష్యత్తులో సముచిత స్థానం కల్పిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ భరోసాతో ఆదినారాయణ రెడ్డి వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.