ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన నల్గొండ జిల్లాకు చెందిన ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఉద్యోగం వచ్చిన వారంలోనే యువకుడు మరణించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. మునుగోడు పట్టణానికి చెందిన ఈరమళ్ల ప్రసాద్, శ్రీకన్య దంపతుల పెద్ద కుమారుడు సాయితేజ (25) ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లాడు. చదువు పూర్తి చేసుకుని ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న ఆయనకు వారం రోజుల క్రితమే ఓ మంచి ఉద్యోగం లభించింది. ఈ శుభవార్తను కుటుంబ సభ్యులతో పంచుకోవడంతో వారంతా ఎంతో సంతోషించారు.

అయితే, ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో సాయితేజ ప్రయాణిస్తున్న కారుకు అకస్మాత్తుగా ఓ జింక అడ్డువచ్చింది. దాన్ని ఢీకొట్టడంతో అదుపుతప్పిన వాహనాన్ని వెనుక నుంచి వస్తున్న ఇతర వాహనాలు బలంగా ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయితేజను స్థానిక ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

కొడుకు ఉద్యోగంలో చేరాడని, ఇక తమ కష్టాలు తీరాయని ఆనందపడిన తల్లిదండ్రులకు ఈ వార్త పిడుగుపాటులా తగిలింది. స్నేహితుల ద్వారా విషయం తెలుసుకున్న వారు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. సాయితేజ మరణంతో మునుగోడులో విషాద ఛాయలు అలముకున్నాయి.