కేసీఆర్‌ హయాంలో అభివృద్ధి బాటలో సాగిన తెలంగాణ గ్రామాలు, ప్రస్తుత కాంగ్రెస్‌ పాలనలో నిధుల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీల ఖర్చులు భారీగా తగ్గిపోయాయని పేర్కొంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన ‘ఫైనాన్సెస్ ఆఫ్ పంచాయతీరాజ్ ఇన్‌స్టిట్యూషన్స్’ నివేదికను ప్రస్తావిస్తూ కేటీఆర్ ఈ వివరాలను వెల్లడించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణలోని గ్రామ పంచాయతీలు సగటున ఒక్కొక్కటి రూ.16.59 లక్షలు ఖర్చు చేయగా, ప్రస్తుత కాంగ్రెస్‌ పాలనలో 2024-25 నాటికి ఆ మొత్తం రూ.6.24 లక్షలకు పడిపోయిందని ఆయన తెలిపారు.

ప్రజలు కట్టిన పన్నులు, ప్రభుత్వం తెస్తున్న అప్పులు అభివృద్ధి పనులకు చేరడం లేదని ఆరోపించారు. రేవంత్‌ రెడ్డి పాలనలో పల్లె నుంచి పట్నం వరకు ఎక్కడా అభివృద్ధి కనిపించడం లేదని, జరుగుతున్నదంతా విధ్వంసమేనని కేటీఆర్ పేర్కొన్నారు.