అభివృద్ధిని విస్మరించి కేవలం సంక్షేమ పథకాల బటన్లు నొక్కితే ప్రజలు అధికారం కట్టబెడతారనుకోవడం భ్రమేనని పీఆర్పీ అధ్యక్షుడు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. తాజాగా ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

"అభివృద్ధిని గాలికొదిలేసి, సంక్షేమ పథకాల బటన్లు నొక్కితే ప్రజలు అధికారం ఇస్తారనుకునే రోజులు పోయాయి. బటన్లు నొక్కితే కాదు.. ప్రజారంజకంగా పరిపాలన చేస్తేనే ప్రజలు అందలమెక్కిస్తారన్నది ఆ రెండు పార్టీలు ఇప్పటికైనా గుర్తెరగాలి. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ గెలిచాం అంటే, ఆ గెలుపు తాత్కాలికమే" అని విజయసాయి అన్నారు.

ప్రజలకు అవసరమైన అభివృద్ధిని పూర్తిగా గాలికొదిలేసి, సంక్షేమాన్నే నమ్ముకుంటే రాజకీయ మనుగడ సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. కేవలం పథకాల అమలుతోనే సరిపెట్టకుండా, ప్రజారంజక పాలన అందించినప్పుడే ప్రజల నుంచి నిజమైన ఆదరణ లభిస్తుందని తెలిపారు. అయితే, ఆయన ప్రస్తావించిన ఆ రెండు పార్టీలు ఏవి అన్నది ఆయన పేర్కొనకపోయినా... ఆ రెండు పార్టీలు టీడీపీ, వైసీపీ అనేది ఎవరికైనా అర్థమవుతుంది. తన పార్టీ పీఆర్పీని ప్రకటించక ముందు నుంచి కూడా ఆయన ఆ రెండు పార్టీల పైనే విమర్శలు ఎక్కుపెడుతున్న సంగతి తెలిసిందే.