వాతావరణ పోకడల్లో వస్తున్న అనూహ్య మార్పులు సాగర గర్భాన్ని తీవ్రంగా వేడెక్కిస్తున్నాయి. ప్రపంచ వాతావరణ వ్యవస్థలను శాసించే పసిఫిక్ మహాసముద్రం ప్రస్తుతం భగభగ మండుతోంది. అయితే ఈ వేడిగాలుల తీవ్రత త్వరలోనే చల్లబడి, భారత రైతులకు ఊరటనిచ్చే పరిణామాలు చోటుచేసుకోనున్నాయన్న అంచనాలు వెలువడుతున్నాయి.

పసిఫిక్‌లో మొదలైన చల్లదనం సూచనలు
ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంపై తీవ్రమైన ఎల్ నినో పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ, భవిష్యత్తుపై సరికొత్త ఆశలు చిగురిస్తున్నాయి. 2027 నైరుతి రుతుపవనాల సమయానికి చల్లటి ప్రభావం చూపే ‘లా నినా’ ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయని హైదరాబాద్‌కు చెందిన భారత జాతీయ మహాసముద్ర సమాచార సేవల కేంద్రం (ఇన్‌కాయిస్) శాస్త్రవేత్తలు గుర్తించారు. తాజా క్లైమేట్ మోడల్స్ రాబోయే మార్పులను స్పష్టంగా సూచిస్తున్నాయి.

వచ్చే మార్చి దాకా తీవ్ర వేడి
కేంద్ర భూవిజ్ఞాన మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇన్‌కాయిస్ రూపొందించిన ఏఐ ఆధారిత మోడల్ ప్రకారం.. నవంబర్ 2026 నుంచి మార్చి 2027 వరకు ఎల్ నినో ప్రభావం 87 నుంచి 100 శాతం వరకు ఉండే అవకాశం ఉంది. అక్టోబర్ 2026లో మధ్య, తూర్పు భూమధ్యరేఖ పసిఫిక్ ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల సెల్సియస్‌కు పైగా పెరిగాయి. ఉపరితలం కింద కూడా 4 డిగ్రీల కంటే ఎక్కువ వేడి నమోదవుతుండటంతో ఎల్ నినో ఇంకా బలపడుతోందని స్పష్టమవుతోంది.

రుతుపవనాలకు లా నినా దన్ను
వచ్చే ఏడాది ఏప్రిల్-జూన్ మధ్య పసిఫిక్‌లో సాధారణ పరిస్థితులు నెలకొనే వీలుంది. ఆ తర్వాత జూన్-ఆగస్టు కాలంలో లా నినా బలపడే అవకాశాలు క్రమంగా పెరుగుతాయి. తూర్పు పసిఫిక్ వేడెక్కే ఎల్ నినో వల్ల వర్షపాతం తగ్గి వ్యవసాయం, ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటాయి. అదే సమయంలో పసిఫిక్ చల్లబడే లా నినా పరిణామం భారత రుతుపవనాలకు ఎంతో మేలు చేస్తుందని, సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసేందుకు దోహదపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

సాగరాల్లో రగులుతున్న వేడి తరంగాలు
ఉత్తర హిందూ మహాసముద్రంలో వేడి తీవ్రత ఆందోళన కలిగిస్తోంది. 2026 అక్టోబర్-నవంబర్ కాలంలో అరేబియా సముద్రంలో ఏకంగా 80 నుంచి 90 శాతం మేర మెరైన్ హీట్‌వేవ్ పరిస్థితులు అలముకున్నాయి. బంగాళాఖాతంలో కూడా తీవ్ర ఉష్ణ తరంగాలు నమోదయ్యాయి. ఈ పరిణామాలు సముద్ర అలల ఎత్తులో తీవ్ర మార్పులకు కారణమవుతున్నాయి.

మత్స్య సంపదపై ప్రతికూల ప్రభావం
సుదీర్ఘ కాలం సాగే సముద్ర తాపం వల్ల పగడపు దిబ్బలు తెల్లబారే ప్రమాదం ఉంది. అంతేకాకుండా వాణిజ్యపరంగా ఎంతో కీలకమైనఇండియన్ ఆయిల్ సార్డిన్, ఇండియన్ మాకెరెల్ వంటి చేపల సంచార ప్రాంతాలు మారే వీలుంది. ఇది మత్స్యకారుల జీవనోపాధిపై ప్రభావం చూపనుంది. మారుతున్న పరిస్థితుల దృష్ట్యా సముద్ర తీర ప్రజలు, మత్స్యకారులు ఎప్పటికప్పుడు హెచ్చరికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.