ప్రకాశం జిల్లాలో ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఒంగోలు సమీపంలోని పెళ్లూరు వద్ద అతివేగంతో వెళ్తున్న కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొన్న ఘటనలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఇద్దరు స్వల్ప గాయాలతో ఈ ప్రమాదం నుండి ప్రాణాపాయం లేకుండా బయటపడ్డారు.

వివరాల్లోకి వెళితే.. తిరుపతి నుంచి ఆరుగురు వ్యక్తులు మారుతి సుజుకి ఎర్టిగా కారులో బాపట్లకు బయలుదేరారు. శనివారం ఉదయం 6:10 గంటల సమయంలో ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని పెళ్లూరు వద్దకు చేరుకోగానే, డ్రైవర్ ప్రవీణ్ నిద్రమత్తులోకి జారుకోవడంతో వాహనం అదుపు తప్పింది. జాతీయ రహదారి పక్కనే ఉన్న కల్వర్టు గోడను కారు బలంగా ఢీకొట్టి, సమీపంలోని కాలువలో బోల్తా పడింది.

ఈ ఘోర ప్రమాదంలో డ్రైవర్ ప్రవీణ్‌తో పాటు కారులో ప్రయాణిస్తున్న వెంకట్రావు, సుజాత, సీతామహాలక్ష్మి సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. కారులో ఉన్న నూతన దంపతులు శ్రీతేజ, కైవల్య స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని 108 అంబులెన్స్‌లో ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.