వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత బ్యాటర్లు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. ఓపెనర్ కేఎల్ రాహుల్ (136) అద్భుతమైన సెంచరీతో కదం తొక్కడంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 4 వికెట్ల నష్టానికి 486 పరుగుల భారీ స్కోరు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 118 పరుగుల కీలక ఆధిక్యం సంపాదించింది.

భారత ఇన్నింగ్స్‌కు రాహుల్ సెంచరీ వెన్నెముకగా నిలిచింది. 9 ఫోర్లు, 2 సిక్సర్లతో రాహుల్ తన టెస్ట్ కెరీర్‌లో 13వ శతకాన్ని నమోదు చేశాడు. మరో బ్యాటర్ దేవదత్ పడిక్కల్ (80)తో కలిసి రెండో వికెట్‌కు 165 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే కైల్ జేమీసన్ బౌలింగ్‌లో పడిక్కల్ ఔటయ్యాడు.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (98) కూడా అద్భుతంగా ఆడాడు. సెంచరీ ఖాయమనుకున్న తరుణంలో, మూడో రోజు ఆటలో చివరి ఓవ‌ర్‌లో జాకబ్ డఫీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయి నిరాశగా వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో దూకుడుగా ఆడిన రిషబ్ పంత్ (55 నాటౌట్), నైట్ వాచ్‌మన్‌గా వచ్చిన అన్షుల్ కంబోజ్ (0) ఉన్నారు. అంత‌కుముందు ఆతిథ్య కివీస్ త‌న తొలి ఇన్నింగ్స్‌లో 368 ర‌న్స్‌కు ఆలౌట్ అయిన విష‌యం తెలిసిందే.