నిత్యావసర సరకుల ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. ధరల నియంత్రణపై క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజలపై ఆర్థిక భారం పడకుండా ఏడాది కాలానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు. మార్కెట్‌లో ధరల హెచ్చుతగ్గులను అరికట్టేందుకు ప్రతివారం సమీక్షలు జరపడంతో పాటు నిరంతర క్షేత్రస్థాయి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.

ధరల స్థిరీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా సుమారు రూ.100 కోట్లను వెచ్చిస్తోందని సీఎం వెల్లడించారు. ఇందులో భాగంగా వచ్చే నెల ఒకటో తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చౌకధరల దుకాణాల (రేషన్ షాపులు) ద్వారా ప్రత్యేక సబ్సిడీ ధరలతో సరుకులను పంపిణీ చేయనున్నారు. ఈ నిర్ణయం ప్రకారం కిలో కందిపప్పు రూ.100, కిలో గోధుమ పిండి రూ. 25, లీటర్ పామాయిల్ రూ.125 చొప్పున కార్డుదారులకు అందజేయనున్నారు.

మరోవైపు ప్రజా పంపిణీ వ్యవస్థలోని రేషన్ బియ్యం అక్రమ రవాణా, బ్లాక్ మార్కెట్ నిల్వలపై ఉక్కుపాదం మోపాలని సీఎం అధికారులను ఆదేశించారు. పప్పుధాన్యాలు, వంటనూనెలతో పాటు మార్కెట్లో కూరగాయల ధరల హెచ్చుతగ్గులపైనా నిరంతరం పర్యవేక్షణ ఉండాలన్నారు. పంటలు పండించే అన్నదాతలకు నష్టం వాటిల్లకుండా, కొనుగోలు చేసే సామాన్యుడిపై భారం పడకుండా సమతుల్య విధానాలతో చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.