తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం' క్షేత్రస్థాయిలో కార్యరూపం దాల్చింది. పేద కుటుంబాల్లోని పెద్ద దిక్కుకు రూ. 5 లక్షల బీమా భద్రత కల్పించే ఈ పథకం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం సిద్దిపేటలో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన నేపథ్యంలో, ప్రభుత్వం పూర్తి మార్గదర్శకాలు విడుదల చేసింది.

అసెంబ్లీ ఎన్నికల హామీలో భాగంగా అమలు చేస్తున్న ఈ పథకం కింద లబ్ధిదారులు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. పూర్తి ప్రీమియం ప్రభుత్వమే భరిస్తుంది. కుటుంబ పెద్దగా ఉన్న వ్యక్తికి మాత్రమే ఈ బీమా వర్తిస్తుంది. ఒకవేళ కుటుంబంలో ఒకరి కన్నా ఎక్కువ మంది సంపాదించేవారు ఉంటే, ఎవరి పేరుపై బీమా చేయాలో ఆ కుటుంబమే నిర్ణయించుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రాథమికంగా రేషన్ కార్డు ఆధారంగా అర్హులను గుర్తించి, ఆ తర్వాత ఆధార్ కార్డును కూడా పరిగణనలోకి తీసుకుంటారు.

ఈ నెల 19న ఇది ప్రారంభం కాగా డిసెంబర్ 18 వరకు నెల రోజుల పాటు లబ్ధిదారుల నమోదు ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నెల 23వ తేదీ నుంచి మూడు నాలుగు గ్రామ పంచాయతీలను కలిపి ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేసి ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తారు. గ్రామ పంచాయతీ, మున్సిపల్ వార్డు కార్యాలయాల్లోనూ వివరాలు నమోదు చేసుకోవచ్చు. 1967 నవంబర్ 19 నుంచి 2008 నవంబర్ 18 మధ్య జన్మించిన 18 నుంచి 59 ఏళ్ల వయస్కులు ఈ పథకానికి అర్హులు. గతంలో నిర్వహించిన 'సీప్‌' సర్వే ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 1.15 కోట్ల కుటుంబాలకు ఈ పథకాన్ని అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

నమోదు ప్రక్రియను పర్యవేక్షించేందుకు జిల్లా కలెక్టర్లను నోడల్ అధికారులుగా నియమించారు. లబ్ధిదారుడి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మొబైల్ నంబర్ వంటి వివరాలను సేకరించి, ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక మొబైల్ యాప్‌లో నమోదు చేస్తారు. క్యాంపు స్థాయిలో భౌతిక రిజిస్టర్‌ను కూడా నిర్వహిస్తూ పారదర్శకంగా ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.