అమెరికా గడ్డపై ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌ను హత్య చేసేందుకు విఫలయత్నం చేసిన కేసులో భారత జాతీయుడు నిఖిల్ గుప్తాకు భారీ జైలు శిక్ష పడింది. ఈ కేసులో గుప్తాకు 19 సంవత్సరాల 7 నెలల (235 నెలలు) కఠిన కారాగార శిక్ష విధిస్తూ న్యూయార్క్‌లోని ఫెడరల్ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసు అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమైన నేపథ్యంలో యూఎస్ కోర్టు తీర్పు ప్రాధాన్యత సంతరించుకుంది.

సదరన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్ న్యాయమూర్తి విక్టర్ మర్రెరో శుక్రవారం సుమారు 80 నిమిషాల పాటు వాదనలు విన్న అనంతరం ఈ శిక్షను ఖరారు చేశారు. 55 ఏళ్ల నిఖిల్ గుప్తా తనపై మోపబడిన మూడు ప్రధాన ఆరోపణలను ఈ ఏడాది ఆరంభంలోనే అంగీకరించారు. కిరాయి హత్యకు ప్రయత్నించడం, హత్యకు కుట్ర పన్నడం, మనీ లాండరింగ్‌కు పాల్పడటం వంటి అభియోగాలను ఆయన ఒప్పుకున్నారు. దీంతో కోర్టు శిక్షను ఖరారు చేసింది.

అండర్‌కవర్ ఆపరేషన్‌తో కుట్ర భగ్నం
2023లో పన్నూన్ హత్యకు ఈ కుట్ర రూపుదిద్దుకుంది. నిఖిల్ గుప్తా ఈ హత్యను అమలు చేయడానికి ఒక వ్యక్తిని సంప్రదించారు. అయితే, అతను నేరస్థుడు కాదు. అమెరికా డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్ (డీఈఏ) కోసం పనిచేస్తున్న ఒక రహస్య ఇన్ఫార్మర్. దీంతో గుప్తా కార్యకలాపాలన్నీ అమెరికా ఏజెన్సీల నిఘాలోకి వెళ్లాయి.

వికాశ్ యాదవ్ అనే మరో నిందితుడితో కలిసి గుప్తా ఈ కుట్రను నడిపినట్లు అమెరికా ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. పన్నూన్ హత్యకు 1,00,000 డాలర్లకు డీల్ కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా, అడ్వాన్స్‌గా 15,000 డాలర్ల నగదును గుప్తా సహచరుడు ఒకరు డీఈఏ అండర్‌కవర్ ఆఫీసర్‌కు 2023 జూన్ 9న అందజేశారు. ఈ లావాదేవీలన్నింటినీ అధికారులు రికార్డ్ చేసి, పక్కా ఆధారాలతో గుప్తాను అరెస్ట్ చేశారు.

కోర్టులో పశ్చాత్తాపం
శిక్ష విధించడానికి ముందు నిఖిల్ గుప్తా కోర్టులో తన చర్యలపై తీవ్ర పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేశారు. "2023 నాటి కాలానికి వెళ్లి నా తప్పులను సరిదిద్దుకోవాలని ఉంది. ఆ సమయంలో నేను ఎలా ప్రవర్తించానో నాకే గుర్తులేదు" అని తన లేఖలో పేర్కొన్నారు. ఆ సమయంలో తాను కుటుంబానికి దూరమయ్యానని, ప్రతిరోజూ మద్యం సేవించేవాడినని తెలిపారు. తన చర్యల వల్ల తన కుటుంబానికి, చుట్టుపక్కల వారికి కలిగిన బాధకు క్షమించాలని కోరారు. 

తన చర్యల వల్ల ఎవరికీ ప్రాణనష్టం జరగకపోవడం అదృష్టమని, అది జరిగి ఉంటే జీవితాంతం బాధపడేవాడినని గుప్తా తెలిపారు. మరోవైపు, ఈ బెదిరింపుల కారణంగా గత 1200 రోజులుగా తాను సరిగా న్యాయవాద వృత్తిని కొనసాగించలేకపోయానని పన్నూన్ కోర్టుకు వివరించారు.