రాబోయే 2029 లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ అధిష్ఠానం పార్టీ సంస్థాగత నిర్మాణంలో భారీ ప్రక్షాళన చేపట్టింది. వివిధ రాష్ట్రాలు, కీలక విభాగాల పర్యవేక్షణ కోసం మొత్తం 81 మంది నూతన జాతీయ కార్యదర్శులను నియమిస్తూ ఏఐసీసీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ క్రమంలోనే గతంలో బాధ్యతలు నిర్వర్తించిన 25 మంది నాయకులను పదవుల నుంచి తప్పించి, సరికొత్తగా 43 మంది కొత్త ముఖాలకు అవకాశం కల్పించింది.

ఈ నియామకాల్లో రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా ‘సామాజిక న్యాయం’ సూత్రానికి పెద్దపీట వేశారు. మొత్తం 81 మంది కార్యదర్శుల్లో దాదాపు మూడింట రెండు వంతుల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ మరియు మైనార్టీ వర్గాలకు చెందినవారే ఉన్నారు. ఇందులో జనరల్ కేటగిరీ నుంచి 29 మంది, ఓబీసీ నుంచి 20, ఈబీసీ నుంచి 5, ఎస్సీల నుంచి 11, ఎస్టీల నుంచి 5, మైనార్టీల నుంచి 11 మందికి చోటు దక్కింది. మహిళా ప్రాతినిధ్యం కింద 12 మందికి (సుమారు 15 శాతం) బాధ్యతలు అప్పగించారు. ఈ నేతల సగటు వయస్సు 49 ఏళ్లు కాగా, మెజారిటీ నాయకులు 50 ఏళ్ల లోపు వారే కావడం విశేషం.

ఈ ఎంపిక కోసం రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, ప్రియాంక గాంధీలు దాదాపు 200 మంది నేతలను స్వయంగా ఇంటర్వ్యూ చేసి జాబితాను సిద్ధం చేశారు. మీడియా, కమ్యూనికేషన్స్ విభాగ కార్యదర్శులుగా డాక్టర్ వినీత్ పునియా, రుచిరా చతుర్వేదిలను కొనసాగించగా, కాంగ్రెస్ అధ్యక్షుడి కార్యాలయ కార్యదర్శులుగా ప్రణవ్ ఝా, గౌరవ్ పాంధీలు తమ బాధ్యతల్లో కొనసాగనున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే బాధ్యతను ఈ నూతన కార్యదర్శుల బృందానికి కాంగ్రెస్ నాయకత్వం అప్పగించింది.