తెలంగాణకు దక్కాల్సిన నీటి హక్కుల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తే లేదని, కృష్ణా, గోదావరి నదుల నుంచి ఒక్క చుక్క నీటిని కూడా వదులుకోబోమని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. నీటి హక్కుల పరిరక్షణ కోసం ఎంతవరకైనా పోరాడతామని, ఏ త్యాగానికైనా సిద్ధమని తేల్చి చెప్పారు. హుజూర్‌నగర్‌లో జరిగిన బహిరంగ సభలో, హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

నాగార్జున సాగర్ నుంచి 1.8 టీఎంసీల నీటిని తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏకపక్ష ప్రతిపాదనపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి, కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు (కేఆర్‌ఎంబీ) అధికారికంగా అభ్యంతరాలు తెలిపామని వెల్లడించారు. భారత వైమానిక దళంలో ఫైటర్ పైలట్‌గా దేశ సరిహద్దుల్లో ఎంత పట్టుదలతో పనిచేశానో, రాష్ట్ర నీటి హక్కుల పరిరక్షణలోనూ అదే తెగువ చూపిస్తానని ఆయన అన్నారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం కృష్ణా బేసిన్ రైతులకు తీవ్ర అన్యాయం చేసిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. పదేళ్ల పాలనలో ఏపీ ప్రభుత్వం కృష్ణా నుంచి 4,460 టీఎంసీలు తరలించుకుపోతుంటే బీఆర్ఎస్ నేతలు చూస్తూ ఊరుకున్నారని, ఆ సమయంలో తెలంగాణ కేవలం 1993 టీఎంసీలు మాత్రమే వాడుకుందని తెలిపారు. తాము ఏపీ నేతలతో లాలూచీ పడేవాళ్లం కాదని, అందుకే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నీటి వాడకం పెరిగిందని గణాంకాలతో వివరించారు.

సోనియా గాంధీ వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, ఈ విషయాన్ని కేసీఆరే స్వయంగా అసెంబ్లీలో చెప్పారని గుర్తుచేశారు. ఆమె వల్లే తమ కుటుంబానికి పదవులు వచ్చాయన్న విషయాన్ని కేటీఆర్ మర్చిపోయి మాట్లాడుతున్నారని ఉత్తమ్ విమర్శించారు. రాబోయే వేసవిలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రాకుండా చూస్తామని, అర్హులందరికీ చేయూత పెన్షన్లు అందిస్తామని హామీ ఇచ్చారు.