'ఫ్లయింగ్ సిఖ్'గా ప్రసిద్ధి చెందిన దివంగత అథ్లెట్ మిల్ఖా సింగ్ జీవితంలో క్రీడా విజయాలే కాదు, దేశ విభజన నాటి నెత్తుటి గాయాలు కూడా ఉన్నాయి. మత ఘర్షణల్లో కళ్లెదుటే కుటుంబ సభ్యులను కోల్పోయిన ఆయన, కొందరు ముస్లిం మహిళల మానవత్వం వల్ల ప్రాణాలతో బయటపడ్డారు. ఈ భయానక అనుభవాలను ఆయన తన ఆత్మకథ 'ది రేస్ ఆఫ్ మై లైఫ్'లో మరియు పలు ఇంటర్వ్యూలలో స్వయంగా పంచుకున్నారు.

1947 దేశ విభజన సమయంలో మిల్ఖా సింగ్ కుటుంబం పాకిస్థాన్‌లోని గోవింద్‌పురా గ్రామంలో నివసించేది. మత ఘర్షణలు తీవ్రరూపం దాల్చడంతో, అల్లరి మూకలు వారి గ్రామంపై దాడి చేశాయి. ఆ దాడిలో మిల్ఖా సింగ్ కళ్ల ముందే ఆయన తల్లిదండ్రులు, సోదరుడు, ఇద్దరు సోదరీమణులు దారుణంగా హత్యకు గురయ్యారు. చనిపోయే ముందు ఆయన తండ్రి "భాగ్ మిల్ఖా భాగ్" (పరుగెత్తు మిల్ఖా పరుగెత్తు) అని గట్టిగా అరవడం తన జీవితాన్ని మార్చేసిందని మిల్ఖా సింగ్ పేర్కొన్నారు.

తండ్రి చివరి మాటలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగెత్తిన మిల్ఖా సింగ్, భారత్‌కు వస్తున్న శరణార్థుల రైలు ఎక్కేందుకు ముల్తాన్ స్టేషన్‌కు చేరుకున్నారు. అప్పటికే రైళ్లలో హిందువులు, సిక్కులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతుండటంతో, సాధారణ బోగీలో ఉంటే ప్రాణాలు దక్కవని భావించారు. భయంతో ఓ మహిళల కంపార్ట్‌మెంట్‌లో దూరి, సీటు కింద దాక్కున్నారు.

ఆ కంపార్ట్‌మెంట్‌లో ఉన్న వారంతా బురఖా ధరించిన ముస్లిం మహిళలు. తన తల్లిదండ్రులను చంపేశారని, తనను కాపాడాలని మిల్ఖా సింగ్ వారిని ఏడుస్తూ వేడుకున్నారు. ఇంతలో, హిందువులు, సిక్కుల కోసం వెతుకుతున్న అల్లరి మూకలు ఆ బోగీ వద్దకు వచ్చాయి. కానీ, ఆ మహిళలు ఏమాత్రం భయపడకుండా, సీటు కింద దాక్కున్న మిల్ఖా సింగ్ ఉనికిని బయటపెట్టలేదు. తమ సామాను మాటున ఆయన్ను దాచి, ప్రాణాలకు తెగించి కాపాడారు.

ఆ అజ్ఞాత మహిళల మానవత్వం, ధైర్యం వల్లే మిల్ఖా సింగ్ ఆ మారణహోమం నుంచి బయటపడి ఢిల్లీకి సురక్షితంగా చేరుకోగలిగారు. మత విద్వేషం తారస్థాయిలో ఉన్న ఆ క్లిష్ట సమయంలో, సాటి మనిషి ప్రాణాలను కాపాడిన వారిని తన జీవితాంతం కృతజ్ఞతతో గుర్తుచేసుకున్నారు. ఆ తర్వాత భారత సైన్యంలో చేరి, ప్రపంచ ప్రఖ్యాత అథ్లెట్‌గా ఎదిగి దేశానికి గర్వకారణంగా నిలిచారు. 

మిల్ఖాసింగ్ జయంతి సందర్భంగా ఈ విషయం మరోమారు వెలుగులోకి వచ్చింది. కాగా, మిల్ఖా జయంతిని పురస్కరించుకుని పలువురు రాజకీయ నాయకులు, క్రీడాకారులు, సైన్యాధికారులు ఆయనను గుర్తుచేసుకుంటూ నివాళులు అర్పించారు.