ఆంధ్రప్రదేశ్‌లో ఒకవైపు కోస్తా జిల్లాలను తుపాన్లు అతలాకుతలం చేస్తుంటే, మరోవైపు రాయలసీమలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాలు లేక పంటలు ఎండిపోయే దశకు చేరుకోగా, శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం అడుగంటడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

ఎగువ కృష్ణా పరీవాహక ప్రాంతం నుంచి వరద రాక తగ్గడంతో, శ్రీశైలంలో ఉన్న నీటిని కేవలం తాగునీటి అవసరాలకే కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.  తెలంగాణ జలవిద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని వినియోగించడంతో శ్రీశైలంలో నిల్వలు వేగంగా పడిపోయాయి. నవంబర్ 20 నాటికి మొత్తం 215.80 టీఎంసీల సామర్థ్యం ఉన్న శ్రీశైలంలో కేవలం 46.82 టీఎంసీల నీరు మాత్రమే మిగిలి ఉంది. మరో 8 టీఎంసీలు తగ్గితే జలాశయం 38 టీఎంసీల డెడ్ స్టోరేజీ స్థాయికి పడిపోతుంది. డిసెంబర్‌లోనూ నీటి వినియోగం కొనసాగితే వేసవిలో తీవ్ర తాగునీటి ఎద్దడి ఏర్పడుతుందని అధికారులు ఆందోళన చెందుతున్నారు.

రాయలసీమలో వర్షాభావంతో మొక్కజొన్న తదితర పంటలు ఎండుతుండటంతో, హంద్రీ-నీవా సుజల స్రవంతి ద్వారా కనీసం ఒక్క తడికైనా నీరు ఇచ్చి పంటలను కాపాడాలని రైతులు కోరుతున్నారు.

మరోవైపు కృష్ణా డెల్టా సాగునీటి అవసరాలు కూడా ఇంకా తీరలేదు. 312 టీఎంసీల సామర్థ్యం గల నాగార్జున సాగర్‌లో ప్రస్తుతం 177.47 టీఎంసీల నీరు ఉంది. దీంతో డెల్టా అవసరాల కోసం నాగార్జున సాగర్ నుంచి పులిచింతలకు 11 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ఏపీ జలవనరుల శాఖ ఇండెంట్ ఇచ్చింది. నవంబర్ 23న జరిగే కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) త్రిసభ్య కమిటీ సమావేశంలో ఈ నీటి విడుదలను ప్రధాన ఎజెండాగా చేర్చాలని ఏపీ బోర్డుకు లేఖ రాసింది. తాగునీటి కోసం శ్రీశైలాన్ని రక్షించుకుంటూనే, డెల్టా అవసరాలకు సాగర్ నీటిని వాడుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.20261121fr1800d331566f.png20261121fr78b0b962255d.png