మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ హయాంలో అప్పటి గుజరాత్ సీఎం మోదీపై జరగాల్సిన దర్యాప్తును సొంత కాంగ్రెస్ పార్టీ నేతలే అడ్డుకున్నారంటూ తాను చేసిన వ్యాఖ్యలకు ఆ పార్టీ నేత, కేంద్ర మాజీ మంత్రి వీరప్ప మొయిలీ కట్టుబడి ఉన్నానన్నారు. తాను చెప్పిన మాటల్లో ఎలాంటి వివాదానికి తావులేదని, పచ్చి నిజాలనే బయటపెట్టానని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలను తానే వక్రీకరించుకోవడానికి తానేమీ ‘కపటవేషధారిని (హిపోక్రైట్) కాద’ని గురువారం ఐఏఎన్ఎస్ వార్తా సంస్థతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.

మంగళవారం నాడు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ పుస్తకావిష్కరణ సభలో మొయిలీ ప్రసంగించారు. 2009-2011 మధ్య కాలంలో తాను కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉన్న రోజులను గుర్తుచేసుకున్నారు. సోహ్రాబుద్దీన్ షేక్ ఎన్‌కౌంటర్ కేసు సమయంలో అప్పటి గుజరాత్ హోంమంత్రి అమిత్ షా జైలుకు వెళ్లారని, ఆయన్ను గుజరాత్ నుంచి బహిష్కరించారని పేర్కొన్నారు. అమిత్ షా తర్వాత జైలుకు వెళ్లాల్సింది, బహిష్కరణకు గురికావాల్సింది అప్పటి సీఎం నరేంద్ర మోదీయేనని మొయిలీ సంచలన రీతిలో వ్యాఖ్యానించారు. అయితే నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ కాకుండా, కాంగ్రెస్‌లోని కొందరు కీలక నేతల వల్లే మోదీపై విచారణ అర్ధంతరంగా ఆగిపోయిందన్నారు. ఆ తప్పిదం ఫలితంగానే నేడు పార్టీ మూల్యం చెల్లించుకుంటోందని వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలపై చెలరేగిన దుమారంపై గురువారం మొయిలీ స్పందించారు. తాను చేసిన ప్రకటనలో ఒక్క ఫుల్‌స్టాప్ గానీ, కామా గానీ మార్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అమిత్ షాతో పాటు మోదీ కేబినెట్‌లోని పలువురు మంత్రులు అప్పట్లో జైలుకు వెళ్లిన మాట వాస్తవమని, అంతకుమించి తాను ఏమీ అనలేదన్నారు. ఆ నాడు తాను సూచించిన సంస్కరణలు, మార్పులను అమలు చేసి ఉంటే నేడు మోదీ అధికారంలోకి వచ్చే అవకాశమే ఉండేది కాదన్నారు. కానీ యథాతథ స్థితిని కొనసాగించాలనుకునే కాంగ్రెస్‌లోని కొందరు నేతల వల్లే ఆ నిర్ణయాలు ఆగిపోయాయని మొయిలీ పునరుద్ఘాటించారు.