కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ పరంగా అందరూ సమానమేనని, నేతలు ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. సొంత పార్టీ తీరుపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

సదరు ఎమ్మెల్యేల ప్రకటనలను పార్టీ అధిష్ఠానం నిశితంగా గమనిస్తోందని మహేశ్ గౌడ్ తెలిపారు. తెలంగాణకు త్వరలో రానున్న కొత్త పార్టీ ఇన్‌ఛార్జ్ ఈ పరిణామాలను సమగ్రంగా పరిశీలిస్తారని చెప్పారు. కాంగ్రెస్ ఒక ప్రజాస్వామిక పార్టీ అని, దేనికైనా సరైన సమయం ఉంటుందని పేర్కొన్నారు. గతంలో కొండా సురేఖ వ్యవహారంలోనూ చర్యలకు ముందు పలు అవకాశాలు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

ఇదే సమయంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్‌పై మహేశ్ గౌడ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వ హయాంలో సాగునీటి విషయంలో జరిగిన తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొత్త డ్రామాలకు తెరలేపారని ఆయన ఆరోపించారు. ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వమే అంగీకరించిందని, ఇప్పుడు కేంద్ర బలగాలు డ్యామ్‌ల వద్ద ఉండటానికి ఆ నిర్ణయాలే కారణమని పేర్కొన్నారు. 

దక్షిణ తెలంగాణకు కీలకమైన ఎస్ఎల్బీసీ సొరంగం పనులను, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును పదేళ్లపాటు పక్కన పెట్టారని విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టుల పేరుతో సుమారు రూ.1.84 లక్షల కోట్ల ప్రజాధనం వృథా అయిందని ఆరోపిస్తూ, కృష్ణా జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన 70 శాతం వాటా కోసం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రాజీలేని పోరాటం చేస్తోందని ఆయన తెలిపారు.

అంతకుముందు, హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు వద్ద మాజీ ప్రధాని ఇందిరా గాంధీ విగ్రహానికి మహేశ్ కుమార్ గౌడ్ పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. దేశ సమగ్రతకు, పేదల సంక్షేమానికి ఇందిరా గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆమె ఆశయాల సాధనలో భాగంగానే రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.