అమెరికాలోని అతిపెద్ద నగరమైన న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ (35) కాలికి గాయం చేసుకున్నారు. జర్నలిస్టుల బృందంతో గురువారం రాత్రి జరిగిన స్నేహపూర్వక సాకర్ మ్యాచ్‌లో ఆయన అకిలెస్ టెండన్ (కాలి మడమ వద్ద ఉండే కీలకమైన కండరం) తెగింది. దీంతో కొన్ని వారాల పాటు ఆయన మెడికల్ బూట్ ధరించాల్సి ఉంటుంది.

ఈ గాయం కార‌ణంగా శుక్రవారం జరిగిన ఓ మీడియా సమావేశానికి మమ్దానీ ఊతకర్రల సాయంతో హాజరయ్యారు. ఆయన గాయం గురించి ఓ విలేకరి ప్రశ్నించగా, జర్నలిస్టులతో ఆడిన మ్యాచ్‌లో ఇది జరిగిందని వివరించారు. గాయానికి గల కారణాన్ని కూడా ఆయనే స్వయంగా వెల్లడించారు. "ఆటకు ముందు నేను స్ట్రెచింగ్ చేయలేదు" అని నిజాయతీగా ఒప్పుకున్నారు.

అయితే, ఈ గాయం కావడానికి కాస్త ముందు తాను మైదానంలోకి దిగిన వెంటనే ఒక గోల్ కొట్టానని మమ్దానీ సంతోషంగా తెలిపారు. కానీ, "నా వయసు 35 ఏళ్లన్న విషయం మర్చిపోయాను" అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ఆసక్తికరంగా ఈ మ్యాచ్‌లో జర్నలిస్టుల జట్టుపై మేయర్ బృందమే విజయం సాధించిందని ఆయన స్పష్టం చేశారు.

వైద్యుల సూచన మేరకు తాను ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు మెడికల్ బూట్ ధరిస్తానని, పూర్తిగా కోలుకుని మళ్లీ ఫుట్‌బాల్ ఆడటానికి సుమారు తొమ్మిది నెలలు పడుతుందని మేయర్ మమ్దానీ తెలిపారు.