భారత ఆర్థిక వృద్ధి రేటును ఉదహరిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూఎస్ ఫెడరల్ రిజర్వ్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో తక్కువ వడ్డీ రేట్లతో జీడీపీ 7శాతంగా ఉందని, అదే తరహాలో అమెరికాలోనూ వడ్డీ రేట్లను తగ్గిస్తే తమ దేశ వృద్ధి రేటు ఏకంగా 14 నుంచి 20 శాతానికి చేరుకుంటుందని పేర్కొన్నారు. నాలుగు రోజుల ఆసియా పర్యటన ముగించుకుని వాషింగ్టన్ చేరుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

ప్రస్తుతం అమెరికా వృద్ధి రేటు 4 శాతంగా ఉందని ట్రంప్‌ తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత చౌకగా రుణాలు పొందే వెసులుబాటు తమ దేశానికి ఉండాలని స్పష్టం చేశారు. బలమైన ఆర్థిక గణాంకాలు నమోదైనప్పుడు దేశానికి క్రెడిట్ అర్హత పెరుగుతుందన్నారు. తక్కువ వడ్డీకే రుణాలు లభించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ఆర్థిక నివేదికలు బాగున్న సమయంలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచుతోందని ఆరోపించారు. సెంట్రల్ బ్యాంక్ రాజకీయంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఆర్థిక పరిస్థితులు బాగున్నప్పుడు వడ్డీ రేట్లు తగ్గించిన మాజీ ఛైర్మన్ అలాన్ గ్రీన్‌స్పాన్‌ను ఈ సందర్భంగా ప్రశంసించారు.

వడ్డీ రేట్లను ఒక శాతం తగ్గిస్తే జాతీయ రుణ చెల్లింపుల భారం నుంచి దాదాపు 650 బిలియన్ డాలర్ల మేర ఆదా అవుతుందని ట్రంప్‌ తెలిపారు. వేగవంతమైన వృద్ధి ద్వారా రుణాలను త్వరగా తీర్చవచ్చని అభిప్రాయపడ్డారు. అధిక రుణ వ్యయాలు ఉన్నప్పటికీ ఉత్పాదక రంగం గత పది నెలలుగా వృద్ధి బాటలో ఉందన్నారు. కొత్త పరికరాల పెట్టుబడులు 21 శాతం పెరిగాయని చెప్పారు. టారిఫ్‌ల వల్లే కార్ల తయారీ సంస్థలు దేశంలో ఉత్పత్తిని పెంచుతున్నాయని చెప్పారు. ఆడీ 4 బిలియన్ డాలర్లు, టయోటా 5 బిలియన్ డాలర్ల ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. డెట్రాయిట్‌లోని ఫోర్డ్ ప్లాంట్ సైతం నిరంతరాయంగా పనిచేస్తోందని తెలిపారు. నవంబర్ ప్రారంభం నుంచి ముడిచమురు ధరలు 20 శాతం మేర పడిపోయాయన్నారు. పెట్రోల్ ధరలు గ్యాలన్‌కు 60 సెంట్లు తగ్గాయని ట్రంప్ వెల్లడించారు.