ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నమెంట్‌లో భారత్ 'ఎ' జట్టు చారిత్రక విజయంతో బోణీ కొట్టింది. దోహాలోని వెస్ట్ ఎండ్ పార్క్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో నేపాల్‌ను కేవలం 26 పరుగులకే కుప్పకూల్చి, ఏకంగా 306 పరుగుల భారీ తేడాతో రికార్డు విజయాన్ని నమోదు చేసింది. 333 పరుగుల భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్, భారత పేసర్ల ధాటికి తాళలేక కేవలం 11.3 ఓవర్లలోనే చేతులెత్తేసింది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 42 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (9), వైభవ్ సూర్యవంశీ (26), ఆయుష్ బదోని (2) స్వల్ప స్కోర్లకే నిష్క్రమించారు. ఈ దశలో కెప్టెన్ తిలక్ వర్మ (107 బంతుల్లో 113, 6 ఫోర్లు, 4 సిక్సర్లు), వికెట్ కీపర్ బ్యాటర్ కుమార్ కుశాగ్ర (102 బంతుల్లో 117, 10 ఫోర్లు, 5 సిక్సర్లు) అద్భుత సెంచరీలతో జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు ఏకంగా 206 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చివర్లో సూర్యాంశ్ షెడ్గే 14 బంతుల్లోనే 4 సిక్సర్లు, ఒక ఫోర్‌తో 36 పరుగులు బాదడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 332 పరుగులు చేసింది.

అనంతరం 333 పరుగుల ఛేదనలో భారత పేసర్లు నిప్పులు చెరిగారు. పేసర్ ప్రిన్స్ యాదవ్ 5 ఓవర్లలో కేవలం 6 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టగా, హర్షిత్ రాణా 6 ఓవర్లలో 16 పరుగులిచ్చి 4 వికెట్లు కూల్చాడు. స్పిన్నర్ షాబాజ్ అహ్మద్ మిగిలిన ఒక్క వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. నేపాల్ బ్యాటర్లలో పవన్ సరఫ్ (6), రషీద్ ఖాన్ (6) మినహా ఎవరూ కనీసం ఐదు పరుగులు కూడా దాటలేకపోయారు. ఆరుగురు బ్యాటర్లు డకౌట్‌గా వెనుదిరిగారు. లిస్ట్ 'ఎ' క్రికెట్ చరిత్రలోనే నేపాల్ నమోదు చేసిన 26 పరుగులు నాలుగో అత్యల్ప స్కోరు కాగా, భారత్ సాధించిన 306 పరుగుల విజయం ఎనిమిదో అత్యుత్తమ గెలుపుగా రికార్డులకెక్కింది.