బుల్లితెర ప్రేక్షకులను తనదైన కామెడీ టైమింగ్‌తో కడుపుబ్బా నవ్విస్తూ గుర్తింపు తెచ్చుకున్న జబర్దస్త్ నటుడు, దర్శకుడు డేగల బాబు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు. గత ఏడేళ్లుగా ప్రేమిస్తున్న అమూల్య అనే యువతితో శుక్రవారం ఆయన వివాహం అత్యంత వైభవంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను బాబు స్వయంగా సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడంతో నెట్టింట వైరల్‌గా మారాయి.

జబర్దస్త్ కామెడీ షోలో సాధారణ కంటెస్టెంట్‌గా ప్రయాణం ప్రారంభించిన డేగల బాబు, తన వినూత్న పంచులు, ప్రాసలతో అనతికాలంలోనే ప్రముఖ కమెడియన్‌గా ఎదిగాడు. శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలో నటించడమే కాకుండా, వందలాది స్కిట్లకు రచయితగా పనిచేసి బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నాడు. ఇటీవల 'లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' అనే యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ వెబ్ సిరీస్‌తో దర్శకుడిగా మెగాఫోన్ పట్టి ఓటీటీలో మంచి విజయాన్ని అందుకున్నాడు. కెరీర్‌లో స్థిరపడి, దర్శకుడిగా హిట్ కొట్టిన తర్వాతే వివాహం చేసుకోవాలనే లక్ష్యంతో ఇన్నాళ్లూ వేచి చూసిన అతడు అనుకున్నది సాధించి పెళ్లి పీటలెక్కాడు.

బాబు భార్య అమూల్య బి.ఫార్మసీ పూర్తి చేసి, గతంలో కొన్ని ప్రముఖ తెలుగు న్యూస్ ఛానళ్లలో న్యూస్ యాంకర్‌గా బాధ్యతలు నిర్వర్తించింది. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య మొదలైన పరిచయం గాఢమైన ప్రేమగా మారింది. కెరీర్ పరంగా బాబు ఎదిగేందుకు ఆమె పూర్తి సహాయ సహకారాలు అందించింది. డేగల బాబు పెళ్లి వేడుకకు జబర్దస్త్, బుల్లితెర తారలు సునీత, టేస్టీ తేజ, జిత్తు, సందీప్, పంచ్ ప్రసాద్, నూకరాజు తదితరులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.