ఢాకా వేదికగా జరిగిన అంధుల పురుషుల ఆసియా కప్ టోర్నమెంట్‌లో తీవ్ర వివాదం చెలరేగింది. వర్షం కారణంగా ఫైనల్ మ్యాచ్ ఒక్క బంతి కూడా పడకుండా రద్దయింది. వివాదాస్పద రీతిలో పాకిస్థాన్‌ను ఏకపక్షంగా విజేతగా ప్రకటించడంతో భారత అంధుల క్రికెట్ జట్టు ట్రోఫీ ప్రదానోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరించింది. రన్‌రేట్ ఆధారంగా ట్రోఫీని పాక్‌కు కేటాయించడంపై భారత్ తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేసింది.

ఫైనల్ రద్దయినప్పుడు నిబంధనల ప్రకారం ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించాల్సి ఉంటుంది. డబ్ల్యూబీసీసీ (వరల్డ్ బ్లైండ్ క్రికెట్ కౌన్సిల్), పాకిస్థాన్ బ్లైండ్ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు సుల్తాన్ షా టెక్నికల్ కమిటీ ప్రాథమిక నిర్ణయాన్ని తుంగలో తొక్కారని భారత అంధుల క్రికెట్ సంఘం (CABI) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మ్యాచ్ రిఫరీ, అంపైర్లపై ఒత్తిడి తెచ్చి పాక్‌కు అనుకూలంగా నిర్ణయం వెలువడేలా ప్రభావం చూపారని ఆరోపించింది. టోర్నమెంట్ టెక్నికల్ రెగ్యులేషన్స్‌లోని సెక్షన్ 27 ప్రకారం ఇరు జట్లను ఉమ్మడి విజేతలుగా ప్రకటించాలని డిమాండ్ చేసింది.

ఈ వ్యవహారంపై భారత జట్టు కెప్టెన్ టి.దుర్గా రావు ఒక వీడియో సందేశంలో స్పందిస్తూ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. "ఫైనల్ రద్దయ్యాక మ్యాచ్ రిఫరీ మమ్మల్ని పిలిచి, రన్‌రేట్ ఆధారంగా పాకిస్థాన్‌ను విజేతగా, మనల్ని రన్నరప్‌గా ప్రకటిస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి నిర్ణయం మునుపెన్నడూ జరగలేదు. వర్షం వల్ల ఫైనల్ ఆగిపోతే ఉమ్మడి విజేతలుగా ప్రకటించడమే నిబంధన. పూర్తి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం వల్లే మేము ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రెజెంటేషన్ వేడుకను బాయ్‌కాట్ చేశాం" అని స్పష్టం చేశాడు.