జాతీయ సెలక్టర్లు, టీమ్ మేనేజ్‌మెంట్ పనితీరుపై భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, మాజీ చీఫ్ సెలక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు. 15 ఏళ్ల యువ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీకి సరైన అవకాశాలు కల్పించకుండా అతడిని నిరుత్సాహపరుస్తున్నారని ఆరోపించాడు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన 16వ ఫిక్కీ సదస్సులో శ్రీకాంత్ ఈ కీలక వ్యాఖ్యలు చేశాడు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "వైభవ్ విషయంలో సెలక్టర్లు, టీమ్ మేనేజ్‌మెంట్ అనుసరిస్తున్న తీరు ఏమాత్రం సరైంది కాదు. వారు ఆ యువ ఆటగాడిని ప్రోత్సహించాల్సింది పోయి, నిరుత్సాహపరుస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఒక మ్యాచ్‌లో అవకాశం ఇచ్చి, తదుపరి ఐదు మ్యాచ్‌లకు పక్కన పెట్టడం సెలక్టర్లు చేస్తున్న పెద్ద పొరపాటు. ఇది అత్యంత విచారకరం" అని పేర్కొన్నాడు.

వైభవ్ వన్డే, టెస్ట్.. ఇలా రెండు ఫార్మాట్లకు సరిపోయే ప్రతిభావంతుడని శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు. "ఈ కుర్రాడు అద్భుతంగా రాణిస్తున్నాడు. అతడికి నిలకడగా అన్ని మ్యాచ్‌లు ఆడే అవకాశం కల్పించాలి. కనీసం 20 ఇన్నింగ్స్‌ల పాటు జట్టులో చోటుకు ఢోకా లేదని భరోసా ఇవ్వండి. అప్పుడు అతడు ఒంటిచేత్తో ఐదు నుంచి ఏడు మ్యాచ్‌లు గెలిపిస్తాడు" అని ధీమా వ్యక్తం చేశాడు. ఒకవేళ వైభవ్ టెస్ట్ క్రికెట్‌లో విజయవంతమైతే, ప్రపంచవ్యాప్తంగా టెస్ట్ ఫార్మాట్‌కు నూతన జవజీవాలు వస్తాయని శ్రీకాంత్ జోస్యం చెప్పాడు.

తన దూకుడైన బ్యాటింగ్‌తో గుర్తింపు పొందిన వైభవ్ సూర్యవంశీకి భారత సీనియర్ జట్టులో అడపాదడపా అవకాశాలు మాత్రమే లభించాయి. ఇటీవలే దోహాలో నేపాల్‌తో జరిగిన ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ మ్యాచ్‌లో ఇండియా-ఏ తరఫున ఆయన 32 బంతుల్లో 26 పరుగులు చేశాడు. అంతకుముందు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఒక మ్యాచ్‌కు బిహార్ జట్టు సారథిగానూ వ్యవహరించాడు. ఇదే కార్యక్రమంలో సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీలు భారత్ అందించిన అత్యుత్తమ కెప్టెన్లని శ్రీకాంత్ కొనియాడాడు.