తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు అక్రమంగా బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపిస్తూ గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ పార్టీ శ్రేణులతో కలిసి హనుమాన్‌ జంక్షన్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. రహదారి డివైడర్‌పై కూర్చుని నిరసన తెలపడంతో కాసేపు భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.

బాపులపాడు మండలానికి చెందిన సుమారు 20 మంది వైసీపీ నాయకులను పోలీసులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా స్టేషన్‌కు పిలిపించి వేధిస్తున్నారని వంశీ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎస్సై అసభ్యకరంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో సీఐ, ఎస్సైలతో వంశీ తీవ్ర వాగ్వాదానికి దిగారు. మరోవైపు, స్థానిక ఎన్నికల నేపథ్యంలో గతంలో కేసులు ఉన్నవారిని శాంతిభద్రతల పరిరక్షణ కోసం ముందస్తు జాగ్రత్తగా బైండోవర్ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

పోలీసుల సమాధానంపై వంశీ తీవ్రంగా స్పందించారు. కేవలం వైసీపీ వారితోనే శాంతిభద్రతల సమస్య వస్తుందా, అధికార టీడీపీ వారికి ఇవి వర్తించవా? అని నిలదీశారు. ఏదైనా సమస్య ఉంటే చట్టప్రకారం నోటీసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. హనుమాన్‌జంక్షన్ ఎస్సై తీరుపై జిల్లా ఎస్పీతో పాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని వంశీ హెచ్చరించారు. అనంతరం పోలీసులు ఆయనతో మాట్లాడి నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.