రైలు ప్రయాణంలో మొబైల్ ఫోన్లలో బిగ్గరగా మాట్లాడేవారికి, లౌడ్‌స్పీకర్‌లో పాటలు లేదా వీడియోలు ప్లే చేసేవారికి భారతీయ రైల్వే గట్టి హెచ్చరిక జారీ చేసింది. తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తూ న్యూసెన్స్ సృష్టిస్తే జరిమానాతో పాటు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో గరిష్టంగా ఆరు నెలల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

రైల్వే బోర్డు ఆదేశాల మేరకు ఈస్టర్న్ రైల్వే తన పరిధిలోని అన్ని డివిజన్లకు కీలక మార్గదర్శకాలు పంపింది. రైళ్లలో, ముఖ్యంగా ఏసీ బోగీలలో ప్రయాణించేటప్పుడు గంటల తరబడి బిగ్గరగా ఫోన్ సంభాషణలు సాగించడం, రింగ్‌టోన్ శబ్దం ఎక్కువగా ఉంచడం, స్పీకర్లలో ఆడియో-వీడియోలు వినడం వల్ల ఇతర ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని అధికారులు పేర్కొన్నారు.

రైల్వే చట్టం 1989 (సవరించిన నిబంధనల) సెక్షన్ 145 ప్రకారం.. ఇతరులకు ఇబ్బంది కలిగించే ప్రయాణికులపై చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారముంది. సాధారణంగా ఇలాంటి చర్యలకు రూ. 1,000 వరకు జరిమానా విధిస్తారు. అయితే, రైల్వే టికెట్ ఎగ్జామినర్ (టీటీఈ) లేదా సంబంధిత అధికారి హెచ్చరించినప్పటికీ తీరు మార్చుకోకుండా న్యూసెన్స్ కొనసాగిస్తే ఆరు నెలల సాధారణ జైలు శిక్ష, గరిష్టంగా రూ. 5,000 జరిమానా లేదా రెండూ విధించే అవకాశముంది.

ప్రయాణికులు తప్పనిసరిగా ఇయర్‌ఫోన్లు వాడాలని, మొబైల్స్‌ను సైలెంట్ లేదా వైబ్రేషన్ మోడ్‌లో ఉంచుకోవాలని రైల్వే అధికారులు విజ్ఞప్తి చేశారు. దీనిపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు రైల్వే స్టేషన్లు, బోగీలలో హిందీ, ఇంగ్లీష్‌తో పాటు ప్రాంతీయ భాషల్లో అనౌన్స్‌మెంట్లు చేయడంతో పాటు ప్రత్యేక స్టిక్కర్లను కూడా ఏర్పాటు చేయనున్నారు.