అమెరికాలోని న్యూ ఆర్లియన్స్‌లో మిసిసిపీ నదిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 129 మంది ప్రయాణికులతో ఉన్న ఓ విహార నౌకను భారీ ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో నౌక పాక్షికంగా నీట మునిగింది. ఈ ఘటనలో డజన్ల కొద్దీ ప్రయాణికులు గాయపడగా, వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

పోర్ట్ ఆఫ్ న్యూ ఆర్లియన్స్ అధికారుల కథనం ప్రకారం.. స్థానిక కాలమానం ప్రకారం నిన్న‌ మధ్యాహ్నం 12:30 గంటలకు 'అట్లాంటిక్ ఆస్ఫాల్ట్' అనే ట్యాంకర్, 'అమెరికన్ హెరిటేజ్' అనే విహార నౌకను ఢీకొట్టింది. ప్రమాదానికి రెండు గంటల ముందే క్రూయిజ్ నౌక ఒడ్డుకు చేరుకుని, ప్రయాణికులను కిందకు దించడం ప్రారంభించింది. ఈ సమయంలో నియంత్రణ కోల్పోయిన ట్యాంకర్ వేగంగా వచ్చి క్రూయిజ్ షిప్‌ను ఢీకొట్టింది. దీంతో నౌక నెమ్మదిగా మునిగిపోవడం ప్రారంభించి, ఆ తర్వాత పూర్తిగా బోల్తా పడింది. ఈ హఠాత్ పరిణామంతో పలువురు ప్రయాణికులు నదిలో పడిపోయారు.

న్యూ ఆర్లియన్స్ మేయర్ హెలెనా మోరెనో మాట్లాడుతూ.. "నౌకలోని ప్రయాణికులందరినీ గుర్తించాము. వారిలో 32 మంది స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఎవరికీ ప్రాణాపాయం లేదు" అని స్పష్టం చేశారు. సమాచారం అందిన వెంటనే పోర్ట్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, కోస్ట్‌గార్డ్, వైద్య బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. లైఫ్ జాకెట్లతో ఉన్న పలువురిని నది నుంచి సురక్షితంగా బయటకు తీశారు. ముందు జాగ్రత్త చర్యగా మిసిసిపీ నదిలో నౌకల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు.

2015లో నిర్మించిన 'అమెరికన్ హెరిటేజ్' నౌక ఐదు అంతస్తులను కలిగి ఉండి, 150 మంది ప్రయాణికులను తీసుకెళ్లే సామర్థ్యం ఉంది. మరోవైపు 160 మీటర్ల పొడవున్న 'అట్లాంటిక్ ఆస్ఫాల్ట్' ట్యాంకర్ తారు, బిటుమెన్ వంటి వాటిని రవాణా చేస్తుంది. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదని, ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు. నౌకను నిర్వహిస్తున్న అమెరికన్ క్రూయిజ్ లైన్స్ ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.