భారతీయ ఇతిహాసం వెండితెరపై మరోసారి అద్భుతాలు చేస్తోంది. రణ్‌బీర్‌ కపూర్‌ నటించిన ‘రామాయణ: రైజ్‌ ఆఫ్‌ ఎ లెజెండ్‌’ బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన తొమ్మిది రోజులకే ప్రపంచవ్యాప్తంగా రూ.1,100 కోట్ల మార్కును దాటింది. దేశీయంగా విక్కీ కౌశల్‌ నటించిన ‘ఛావా’ లైఫ్‌టైమ్‌ వసూళ్లను అధిగమించి సరికొత్త రికార్డు నెలకొల్పింది.

నితేశ్‌ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తొమ్మిదో రోజు భారత్‌లో రూ.47.85 కోట్ల నెట్‌ వసూళ్లు సాధించింది. దీంతో దేశీయంగా మొత్తం వసూళ్లు రూ.612.45 కోట్లకు చేరాయి. విక్కీ కౌశల్‌ ‘ఛావా’ తన థియేట్రికల్‌ రన్‌లో రూ.601.57 కోట్ల నెట్‌ వసూళ్లు సాధించింది. తాజాగా ఆ రికార్డును ‘రామాయణ’ అధిగమించింది.

సినీ వసూళ్ల ట్రాకర్‌ సాక్‌నిల్క్‌ ప్రకారం.. తొమ్మిదో రోజు ఈ సినిమా 22,993 షోలలో ప్రదర్శితమైంది. హిందీ వెర్షన్‌ అత్యధికంగా రూ.36.25 కోట్లు వచ్చాయి. మలయాళంలో రూ.3.25 కోట్లు, కన్నడలో రూ.3 కోట్లు, తమిళంలో రూ.2.75 కోట్లు, తెలుగులో రూ.2.60 కోట్లు వసూలు చేసింది. దేశీయ గ్రాస్‌ వసూళ్లు రూ.732.20 కోట్లకు చేరాయి.

అంతర్జాతీయ మార్కెట్‌లో తొమ్మిదో రోజు రూ.25 కోట్ల గ్రాస్‌ వసూళ్లు సాధించింది. దీంతో విదేశాల్లో మొత్తం వసూళ్లు రూ.378.50 కోట్లకు చేరాయి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం గ్రాస్‌ కలెక్షన్లు రూ.1,110.70 కోట్లుగా నమోదయ్యాయి.

‘ఛావా’ను అధిగమించడానికి ముందే ఈ సినిమా షారుక్‌ ఖాన్‌ ‘పఠాన్‌’ (రూ.544.28 కోట్లు), రణ్‌బీర్‌ కపూర్‌ నటించిన ‘యానిమల్‌’ (రూ.556.36 కోట్లు) దేశీయ లైఫ్‌టైమ్‌ నెట్‌ వసూళ్లను దాటేసింది. నవంబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం భారత్‌లో తొలి రోజు రూ.64.85 కోట్ల నెట్‌ వసూళ్లతో ఖాతా తెరిచింది. ఐదో రోజు అత్యధికంగా వసూళ్లు సాధించింది. తొలి ఎనిమిది రోజుల విస్తృత ఓపెనింగ్‌ వీక్‌ ముగిసేసరికి ప్రపంచవ్యాప్తంగా రూ.1,000 కోట్ల క్లబ్‌లో చేరింది.