బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనా స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు భారత్‌ సుముఖంగా ఉన్నట్లు సమాచారం. అయితే ఆమె భద్రతకు, న్యాయపరమైన హక్కులకు హామీ లభించిన తర్వాతే ఇందుకు అంగీకరించాలని భావిస్తున్నట్లు బీబీసీ బంగ్లా కథనం వెల్లడించింది. హసీనా తిరుగు ప్రయాణాన్ని బంగ్లాదేశ్‌ సైన్యం పర్యవేక్షించాలని, అక్కడ ఆమెకు కొత్తగా నిష్పాక్షిక విచారణ జరిగేలా ఢాకా హామీ ఇవ్వాలని న్యూఢిల్లీ కోరుతున్నట్లు పేర్కొంది. డిసెంబరులో స్వదేశానికి వెళ్తానని హసీనా ప్రకటించిన నేపథ్యంలో ఈ పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

సైన్యం పర్యవేక్షణలోనే ప్రయాణం?
2024 ఆగస్టు 5న బంగ్లాదేశ్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో అప్పటి ప్రధాని హసీనా సైనిక విమానంలో భారత్‌కు చేరుకున్నారు. ఇప్పుడు ఆమెను తిరిగి తీసుకెళ్లే బాధ్యతను కూడా బంగ్లాదేశ్‌ సైన్యమే చేపట్టాలని భారత్‌ కోరుతున్నట్లు బీబీసీ బంగ్లా తెలిపింది. సైనిక విమానం ద్వారా ఢిల్లీ నుంచి తీసుకెళ్లడం లేదా నిర్దేశిత సరిహద్దు ప్రాంతంలో సైన్యం ఆమెను స్వీకరించడం వంటి మార్గాలను పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు భారత్‌ సిద్ధంగా ఉందని కథనంలో వెల్లడించింది.

మరణశిక్షపై అప్పీలుకు అవకాశం ఇవ్వాలి
హసీనాకు విధించిన మరణశిక్షపై అప్పీలు చేసుకునే అవకాశం కల్పించాలని భారత్‌ కోరుతున్నట్లు సమాచారం. 2024 జులైలో జరిగిన హింసాకాండకు సంబంధించిన ఆరోపణలపై కొత్తగా, నిష్పాక్షికంగా విచారణ జరగాలని భావిస్తున్నట్లు బీబీసీ పేర్కొంది. అంతర్జాతీయ సమాజం, ప్రపంచ మీడియా పర్యవేక్షణలో విచారణ సాగాలని భారత విదేశాంగ శాఖకు చెందిన ఓ అధికారి అభిప్రాయపడినట్లు తెలిపింది. ఆమెను ఉరితీసే పరిస్థితులకు అప్పగించబోమని, న్యాయమైన విచారణకు అవకాశం ఉండాలని భారత్‌ కోరుకుంటోందని ఆ అధికారి పేర్కొన్నట్లు కథనం వెల్లడించింది.

కొన్ని నెలలుగా తెరవెనుక చర్చలు
హసీనా తిరుగు ప్రయాణానికి సంబంధించి భారత్‌, బంగ్లాదేశ్‌ మధ్య కొన్ని నెలలుగా తెరవెనుక చర్చలు జరుగుతున్నట్లు బీబీసీ బంగ్లా తెలిపింది. అక్టోబరు మొదటి వారంలో బంగ్లాదేశ్‌లో భారత హైకమిషనర్‌ దినేశ్‌ త్రివేది ఢిల్లీలో ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ధీరజ్‌ సేఠ్‌తో సమావేశమయ్యారని పేర్కొంది. అక్టోబరు 6న జరిగిన ఈ భేటీలో ద్వైపాక్షిక సహకారం, రక్షణ సంబంధాల బలోపేతంపై చర్చించినట్లు భారత సైన్యం ఎక్స్‌లో వెల్లడించింది. అయితే ఈ సమావేశం హసీనా తిరుగు ప్రయాణానికి సంబంధించినదేనని బీబీసీ కథనం పేర్కొంది.

డిసెంబరులో తిరుగు ప్రయాణం కష్టమేనా?
హసీనా నవంబరు 9న కొత్త పాస్‌పోర్టు, ప్రయాణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకోవడం ద్వారా ప్రవాసం తర్వాత బంగ్లాదేశ్‌ ప్రభుత్వంతో తొలి అధికారిక సంప్రదింపులు ప్రారంభించారు. అయితే ఢాకా నుంచి సానుకూల స్పందన రాలేదు. ఆమెను అప్పగించాలని బంగ్లాదేశ్‌లోని కొందరు నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు డిసెంబరులో స్వదేశానికి వెళ్తానని హసీనా ప్రకటించారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె రాక సాధ్యపడకపోవచ్చని భారత అధికార వర్గాలు భావిస్తున్నట్లు బీబీసీ తెలిపింది. ఆమె తిరిగి వస్తే బంగ్లాదేశ్‌ ఎదుర్కొంటున్న సమస్యలు మరింత పెరుగుతాయని ఢాకా భావిస్తోందని కథనంలో పేర్కొంది.

హసీనాకు ఆశ్రయమిచ్చేందుకు ఏ దేశమూ ముందుకు రావడం లేదని బంగ్లాదేశ్‌ ప్రధాని తారిఖ్‌ రెహమాన్‌ సహాయ ప్రెస్‌ కార్యదర్శి కేఎం నజ్ముల్‌ హక్‌ ఫేస్‌బుక్‌లో వ్యాఖ్యానించారు. అయితే భారత్‌ షరతులు విధించినట్లు వచ్చిన కథనాలపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ స్పందించేందుకు నిరాకరించారు. ఈ అంశంపై భారత్‌ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.