వ్యాపారంలో భారీ లాభాలు వస్తాయంటూ నమ్మించి ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల నుంచి సుమారు రూ.1.59 కోట్లు కాజేసిన ఘటన హైదరాబాద్‌లో వెలుగుచూసింది. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పోలీసుల వివరాల ప్రకారం... బేగంపేటకు చెందిన రేపల్లె అచ్యుత్, సనత్‌నగర్‌కు చెందిన పూజారి లోకేశ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. వీరిద్దరికీ మాచిరెడ్డి సాయి వెంకట మనోజ్ కుమార్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తన తల్లి విశాఖపట్నంలో అరబిందో ఫార్మా కంపెనీకి సెక్యూరిటీ సిబ్బంది, లేబర్, లాండ్రీ సేవలను అందించే కాంట్రాక్ట్ ఏజెన్సీని నడుపుతోందని అతడు చెప్పాడు. ఈ క్రమంలో తన స్నేహితుడైన వెబ్‌కార్ప్స్ సీఈవో చిరాగ్‌ను కూడా వారికి పరిచయం చేశాడు.

ఈ సర్వీస్ వ్యాపారంలో పెట్టుబడి పెడితే వచ్చే లాభాల్లో భారీ వాటా ఇస్తానని మనోజ్ కుమార్ బాధితులకు ఆశ చూపించాడు. వారిలో నమ్మకం కలిగించేందుకు ప్రారంభంలో లాభాల పేరిట కొంత మొత్తాన్ని చెల్లించాడు. దీంతో అతడి మాటలను పూర్తిగా విశ్వసించిన బాధితులు విడతలవారీగా మొత్తం రూ.1.59 కోట్లను అతనికి అప్పగించారు.

అయితే పెట్టుబడి మొత్తం చేతికి అందిన తర్వాత మనోజ్ కుమార్ ముఖం చాటేశాడు. బాధితులు తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని పదేపదే ఒత్తిడి చేయడంతో స్పందించడం మానేశాడు. తమలాగే మరికొందరు కూడా ఈ ముఠా చేతిలో మోసపోయారని బాధితులు ఆరోపించారు. మనోజ్ కుమార్, అతని భార్య మౌనిక, థాని నళిని కలిసి ఈ మోసానికి పాల్పడ్డారని బాధితులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.