తమిళనాడు శాసనసభలో ప్రతిపక్ష నేత, డీఎంకే కీలక నేత ఉదయనిధి స్టాలిన్‌కు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో చెపాక్-తిరువల్లికేని నియోజకవర్గం నుంచి ఆయన సాధించిన విజయాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ ఎన్నికల పిటిషన్‌ను ప్రాథమిక దశలోనే కొట్టివేయాలన్న ఉదయనిధి అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. 

ఈ పిటిషన్‌పై పూర్తిస్థాయి విచారణ కొనసాగిస్తామని స్పష్టం చేస్తూ, నాలుగు వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఉదయనిధిని ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 11వ తేదీకి వాయిదా వేసింది.

ఈ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన పి. మిలానీ ఈ ఎన్నికల పిటిషన్‌ను దాఖలు చేశారు. ఉదయనిధి తన ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తుల వివరాలను సరిగ్గా వెల్లడించలేదని, నామినేషన్ పత్రాల సమర్పణలో అవకతవకలు జరిగాయని మిలానీ ఆరోపించారు.

అయితే, ఫలితాలు వెల్లడైన తర్వాత ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం నిర్ణీత 45 రోజుల గడువు దాటిన తర్వాత ఈ పిటిషన్ వేశారని, అందువల్ల దీనిని కొట్టివేయాలని ఉదయనిధి తరఫు న్యాయవాదులు వాదించారు. కానీ ఫలితాలు ప్రకటించిన రోజును మినహాయించి 45 రోజుల సమయాన్ని లెక్కించాలని, ఆ లెక్కన పిటిషన్ గడువు లోపలే దాఖలైందని న్యాయమూర్తి స్పష్టం చేశారు.

2026 ఎన్నికల్లో ఉదయనిధి స్టాలిన్ 62,992 ఓట్లతో విజయం సాధించగా, ఆయన సమీప ప్రత్యర్థి టీవీకే అభ్యర్థి డి. సెల్వం 55,852 ఓట్లు పొందారు. పిటిషనర్ మిలానీకి 30 ఓట్లు వచ్చాయి. తాజాగా హైకోర్టు తీసుకున్న నిర్ణయంతో ఉదయనిధి ఎన్నిక చెల్లుబాటుపై న్యాయ విచారణ ముందుకు సాగనుంది.