1960లో ‘సైన్స్’ జర్నల్‌లో ప్రచురితమైన ఓ పరిశోధన పత్రం ప్రకారం.. 2026 నవంబర్ 13న ప్రపంచ జనాభా అనంతానికి చేరుకోవాలి. అయితే ఆ అంచనా ఎందుకు నిజం కాలేదు?

ఆ రోజు రానే వచ్చింది. ఆరు దశాబ్దాల క్రితం ఓ శాస్త్రీయ పరిశోధనలో ప్రపంచం అంతమయ్యే తేదీగా పేర్కొన్న 2026 నవంబర్ 13 వెళ్లిపోయింది. అయితే ఈ అంచనా వెనుక గ్రహశకలం ఢీకొనడం, యుద్ధం, ప్రకృతి విపత్తు వంటి కారణాలేవీ లేవు. ప్రపంచ జనాభా విపరీతంగా పెరుగుతుందన్న గణిత లెక్కలే దీనికి ఆధారం.

1960లో వెలువడిన పరిశోధన
భౌతిక శాస్త్రవేత్త హీంజ్ వాన్ ఫోర్స్‌టర్‌, ఆయన సహచరులు ప్యాట్రిసియా ఎం.మోరా, లారెన్స్ డబ్ల్యూ. అమియో కలిసి ఈ పరిశోధన చేశారు. 1960 నవంబర్ 4న ‘సైన్స్’ జర్నల్‌లో ఇది ప్రచురితమైంది. ‘డూమ్స్‌డే: ఫ్రైడే, నవంబర్ 13, ఏ.డి. 2026’ అనే శీర్షికతో ఈ పత్రం వెలువడింది.

జనాభా రెట్టింపయ్యే సమయం తగ్గుతోందని..
క్రీస్తుపూర్వం 400 నుంచి 1958 వరకు ప్రపంచ జనాభా గణాంకాలను పరిశోధకులు పరిశీలించారు. జనాభా రెట్టింపు కావడానికి పడుతున్న సమయం క్రమంగా తగ్గుతున్నట్లు గుర్తించారు. ఇదే ధోరణి కొనసాగితే ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఓ గణిత సూత్రాన్ని రూపొందించారు. దాని ప్రకారం 2020 నాటికి ప్రపంచ జనాభా 2500 కోట్లను దాటుతుందని, 2026 నాటికి అనంతానికి చేరుకుంటుందని అంచనా వేశారు.

హెచ్చరికే కానీ.. ప్రపంచ వినాశనం కాదు
ఈ అంచనా ప్రకారం భవిష్యత్తులో జనాభా పెరుగుదల భరించలేని స్థాయికి చేరుకుంటుందని పరిశోధకులు హెచ్చరించారు. జనాభా పెరుగుదల ఇదే వేగంతో కొనసాగితే మనుషులు ఆకలితో చనిపోరని, జనసాంద్రత కారణంగా నలిగిపోతారని వ్యాఖ్యానించారు. ఈ వాదనలు అప్పట్లో విస్తృత చర్చకు దారితీశాయి. రాజకీయ చర్చల్లోనూ ప్రస్తావనకు వచ్చాయి.

ఎందుకు నిజం కాలేదు?
ఆ మోడల్ సుమారు 30 ఏళ్ల వరకు వాస్తవ జనాభా పెరుగుదలతో సరిపోలింది. అయితే 1993 నుంచి వాస్తవ జనాభా అంచనాల కంటే తక్కువగా నమోదవడం మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా జననాల రేటు తగ్గడమే ఇందుకు ప్రధాన కారణం. ప్రస్తుతం అది 1960లో ఉన్న స్థాయిలో సగం కంటే తక్కువగా ఉంది.

ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం ప్రస్తుతం ప్రపంచ జనాభా సుమారు 820 కోట్లు మాత్రమే. కానీ ఆ గణిత సూత్రం ప్రకారం 2025 నాటికే జనాభా 1,310 కోట్లకు చేరుకోవాల్సి ఉంది. వాన్ ఫోర్స్‌టర్‌ 1911 నవంబర్ 13న జన్మించారు. ఆయన 115వ పుట్టినరోజు కూడా నిన్నే. జనాభా పెరుగుదల నిరంతరం కొనసాగలేదని, దాని ప్రభావాలను ముందుగానే గుర్తించాలని హెచ్చరించడమే ఆ పరిశోధన ప్రధాన ఉద్దేశం. ప్రపంచం అంతమవుతుందనే శాస్త్రీయ ఆధారాలు లేవు.