విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ ప్రాంగణంలో ప్రముఖ పునరుత్పాదక ఇంధన సంస్థ రిసాల్వెన్ సీఈవో పరాగ్ శర్మతో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో స్వచ్ఛ ఇంధన రంగంలో పెట్టుబడులు, ప్రస్తుతం అమలవుతున్న ప్రాజెక్టుల పురోగతిపై వీరి మధ్య కీలక చర్చలు జరిగాయి.

ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ... 2025 పార్టనర్‌షిప్ సమ్మిట్‌లో కుదుర్చుకున్న 1 గిగావాట్ ఎంవోయూ నుంచి 180 మెగావాట్ల విండ్ ప్రాజెక్టు వరకు రిసాల్వెన్ సంస్థ రాష్ట్రంలో స్థిరంగా ఎదుగుతుండటంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల సకాల అమలుకు ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలతో కూడిన రాయలసీమ పునరుత్పాదక ఇంధన జోన్‌లో రౌండ్-ది-క్లాక్ విండ్-సోలార్-బీఈఎస్ఎస్ (బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్) ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని కంపెనీని కోరారు. 

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 12.62 జీడబ్ల్యూహెచ్ బ్యాటరీ స్టోరేజ్ సామర్థ్యాన్ని ఆమోదించిందని, నిర్దేశించుకున్న 25 జీడబ్ల్యూహెచ్ లక్ష్యంలో సగం ఇంకా అందుబాటులో ఉందని వివరించారు.

రిసాల్వెన్ సీఈవో పరాగ్ శర్మ మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే తమ సంస్థ మూడు ప్రాజెక్టులను విజయవంతంగా నిర్వహిస్తోందని తెలిపారు. గనేకో త్రీ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్‌కు 300 మెగావాట్ల విండ్-సోలార్ హైబ్రిడ్ ప్రాజెక్టును ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. మరోవైపు రూ.980 కోట్ల వ్యయంతో కూడిన 100 మెగావాట్ల విండ్-సోలార్ హైబ్రిడ్ ప్రాజెక్టుకు సంబంధించి త్వరలోనే భూసేకరణ ప్రారంభించాల్సి ఉందని పేర్కొన్నారు. ఏపీలో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ప్రాజెక్టును చేపట్టేందుకు తమ సంస్థ ఎంతో ఆసక్తిగా ఉందని పరాగ్ శర్మ స్పష్టం చేశారు.