విశాఖపట్నం వేదికగా రేపటి నుంచి రెండు రోజుల పాటు జరగనున్న సీఐఐ భాగస్వామ్య శిఖరాగ్ర సదస్సుకు సర్వం సిద్ధమైందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఈ సదస్సుకు హాజరవుతున్న పారిశ్రామిక దిగ్గజాలు, అంతర్జాతీయ ప్రతినిధులకు ఆయన సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా హృదయపూర్వక స్వాగతం పలికారు.

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ, ఏపీ ప్రభుత్వం భాగస్వామ్యంతో భారత పరిశ్రమల సమాఖ్య ఈ ప్రతిష్ఠాత్మక సదస్సును నిర్వహిస్తోంది. రేపు ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ సదస్సుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ సదస్సుకు చైర్మన్‌గా, సీఎం చంద్రబాబు కో-చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. నవంబర్ 13న జరిగే ముగింపు సమావేశానికి భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ హాజరుకానున్నారు.

ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 58 దేశాల నుంచి 3,800 మందికి పైగా ప్రతినిధులు, 18 మంది విదేశీ మంత్రులు రానున్నారు. సుమారు రూ.11 లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యంతో 160కి పైగా అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్లు ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీని ద్వారా లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశముంది.

ఈ సందర్భంగా చంద్రబాబు ఎక్స్ వేదికగా స్పందిస్తూ... "విశాఖపట్నం నగరంలో రేపు ప్రారంభం కానున్న 31వ సీఐఐ భాగస్వామ్య శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇవ్వడానికి సర్వం సిద్ధమైంది. కొత్త ఆలోచనలు, గొప్ప ఆశయాలతో వస్తున్న ప్రతినిధులందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈ సదస్సు ద్వారా పారిశ్రామిక దిగ్గజాలు, స్ఫూర్తిదాయక నాయకులు ఒకచోట చేరనున్నారు. కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడానికి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రయాణాన్ని మరింత గొప్ప శిఖరాలకు చేర్చడానికి ఎదురుచూస్తున్నాం" అని పేర్కొన్నారు.