విశాఖపట్నంలో 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ఘనంగా ప్రారంభమైంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ పాల్గొన్నారు. వీరితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 59 దేశాలకు చెందిన పారిశ్రామిక ప్రతినిధులు, అంతర్జాతీయ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ సదస్సును నిర్వహిస్తోంది. ఈ రెండు రోజుల సదస్సులో వివిధ రంగాలకు చెందిన ప్రముఖ సంస్థలతో ఏపీ ప్రభుత్వం 141 కీలక అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోనుంది. వీటి ద్వారా రాష్ట్రానికి సుమారు రూ.12.14 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు వస్తాయని, తద్వారా దాదాపు 2.46 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

మరోవైపు సదస్సు ప్రారంభానికి ముందు పవన్‌ కల్యాణ్‌తో నారా లోకేశ్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్న పలువురు ఇన్వెస్టర్ల వివరాలను లోకేశ్‌ ఈ సందర్భంగా పవన్‌కు వివరించారు. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి చొరవ చూపుతున్న లోకేశ్‌ను పవన్‌ అభినందిస్తూ, రాబోయే రోజుల్లోనూ ఇదే ఉత్సాహంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. పారిశ్రామిక వృద్ధి, నూతన సాంకేతికతల భాగస్వామ్యంతో ఏపీని గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా తీర్చిదిద్దడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశం.