విశాఖపట్నంలో రేపటి నుంచి జరగనున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సుకు హాజరయ్యేందుకు విచ్చేసిన అంతర్జాతీయ ప్రతినిధులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ వినూత్న రీతిలో స్వాగతం పలికారు. గ్లోబల్ డెలిగేట్స్‌ను ఆహ్వానిస్తూ ఆయన సోషల్ మీడియా వేదికగా చేసిన ఓ ఆసక్తికర పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

రాష్ట్ర ప్రత్యేకతను వివరిస్తూ మంత్రి లోకేశ్ తనదైన శైలిలో చమత్కరించారు. "ఆంధ్రాలో 'నాన్-స్పైసీ' అనేది మెనూలో ఆప్షన్ కాదు" అంటూ ఆంధ్రప్రదేశ్ ఆహారపు ఘాటును, విశిష్ట రుచులను విదేశీ ప్రతినిధులకు పరిచయం చేశారు. రాష్ట్రంలో ఆహారం ఎంత ఘాటుగా ఉంటుందో, వ్యాపార పెట్టుబడులకు ఇచ్చే అనుమతులు కూడా అంతే వేగంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, ప్రభుత్వ పనితీరును ప్రస్తావిస్తూ లోకేశ్ ఓ ఆకర్షణీయమైన నినాదాన్ని తెరపైకి తెచ్చారు. "స్పైసీ ఫుడ్.. స్పీడీ అప్రూవల్స్.. ఇదే ఆంధ్ర విధానం" అంటూ ప్రపంచ పారిశ్రామికవేత్తలకు బలమైన సందేశాన్ని పంపారు. అతిథి మర్యాదలతో పాటు పరిశ్రమల ఏర్పాటుకు అత్యంత వేగంగా అనుమతులు మంజూరు చేస్తామనే స్పష్టమైన భరోసాను ఆయన కల్పించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందనే విషయాన్ని స్పష్టం చేస్తూ మంత్రి చేసిన ఈ ట్వీట్ అందరినీ ఆకట్టుకుంటోంది.