న్యూజిలాండ్‌ యువ బ్యాటర్‌ బెవాన్‌ జాకబ్స్‌ దేశవాళీ క్రికెట్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చరిత్ర సృష్టించాడు. ఫోర్డ్‌ ట్రోఫీలో భాగంగా గురువారం ఆక్లాండ్‌ తరఫున ఒటాగోతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 137 బంతుల్లోనే అజేయంగా 202 పరుగులు సాధించాడు. ఇందులో ఏకంగా 21 సిక్సర్లు బాదాడు. దీంతో లిస్ట్‌-ఏ క్రికెట్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన న్యూజిలాండ్‌ బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ప్రపంచ రికార్డుకు మాత్రం మరో రెండు సిక్సర్ల దూరంలో నిలిచాడు.

నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన 28 ఏళ్ల జాకబ్స్‌.. తన తొలి లిస్ట్‌-ఏ సెంచరీని డబుల్‌ సెంచరీగా మలిచాడు. 137 బంతుల్లోనే 200 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, 21 సిక్సర్లు ఉన్నాయి. ఈ ప్రదర్శనతో న్యూజిలాండ్‌ తరఫున లిస్ట్‌-ఏ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా నిలిచాడు.

లిస్ట్‌-ఏ క్రికెట్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్రపంచ రికార్డు ఆస్ట్రేలియాకు చెందిన డార్సీ షార్ట్‌ పేరిట ఉంది. 2018లో సిడ్నీలో వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా తరఫున క్వీన్స్‌లాండ్‌పై ఆడుతూ 148 బంతుల్లో 257 పరుగులు చేసిన షార్ట్‌.. 23 సిక్సర్లు బాదాడు. జాకబ్స్‌ 21 సిక్సర్లతో ఆ రికార్డుకు చేరువయ్యాడు.

జాకబ్స్‌ అజేయంగా చేసిన 202 పరుగులు ఫోర్డ్‌ ట్రోఫీలో ఆక్లాండ్‌ ఏసెస్‌ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరుగా నమోదయ్యాయి. ఈ టోర్నీలో డబుల్‌ సెంచరీ సాధించిన మూడో బ్యాటర్‌గా కూడా నిలిచాడు. లిస్ట్‌-ఏ క్రికెట్‌లో డబుల్‌ సెంచరీ చేసిన నాలుగో న్యూజిలాండ్‌ బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. ఇంతకుముందు జేమీ హౌ (2012), మార్టిన్‌ గప్టిల్‌ (2015), చాడ్‌ బౌస్‌ (2024) ఈ ఘనత సాధించారు.

జాకబ్స్‌ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆక్లాండ్‌ 50 ఓవర్లలో 8 వికెట్లకు 334 పరుగులు చేసింది. అయితే ఒటాగో 49.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో జాకబ్స్‌ పోరాటం జట్టుకు విజయాన్ని అందించలేకపోయింది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల బ్యాటర్లు కలిపి మొత్తం 34 సిక్సర్లు బాదారు.

ఇటీవల భారత్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోనూ జాకబ్స్‌ రాణించాడు. ప్రపంచ ఛాంపియన్‌ భారత జట్టుపై 135కిపైగా పరుగులు సాధించాడు. న్యూజిలాండ్‌ తరఫున 2024 చివర్లో అంతర్జాతీయ టీ20ల్లో అరంగేట్రం చేసిన అతడు ఇప్పటివరకు 16 మ్యాచ్‌లు ఆడాడు. అయితే వన్డేలు, టెస్టుల్లో ఇంకా అరంగేట్రం చేయలేదు.