బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్ జీవితం ఎన్నో నాటకీయ మలుపులు, వివాదాలు, సవాళ్లతో కూడుకున్నదన్న సంగతి తెలిసిందే. అయితే తన జీవితంలో ఎదురైన కష్టాలు, సంఘటనల వెనుక గత జన్మ కర్మల ప్రభావం ఉందంటూ ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ప్రముఖ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన 'కాఫీ విత్ కరణ్' సీజన్ 5 టాక్ షోలో నటి సుస్మితా సేన్‌తో కలిసి పాల్గొన్నప్పుడు సంజయ్ దత్ తన పూర్వజన్మకు సంబంధించిన ఒక విచిత్రమైన అనుభవాన్ని పంచుకున్నారు.

తన స్నేహితుడి సూచన మేరకు గతంలో ఓ చిన్న గ్రామానికి వెళ్లిన విషయాన్ని సంజయ్ దత్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అక్కడ వేలిముద్ర ఆధారంగా తాళపత్రాలను పరిశీలించి (నాడీ జ్యోతిష్యం తరహాలో), అక్కడి పండితుడు తన పూర్వజన్మ గురించి పూసగుచ్చినట్లు వివరించారని తెలిపారు.

ఆ అనుభవాన్ని వివరిస్తూ.. "ఆ గ్రామంలో వేలిముద్ర ఇస్తే, దానికి సంబంధించిన తాళపత్రాన్ని వెతికితీశారు. ఆ పత్రాల ప్రకారం నేను గత జన్మలో అశోక సామ్రాజ్య కాలంలో ఒక రాజుగా ఉండేవాడినని చెప్పారు. నా భార్య నా మంత్రిని ప్రేమించింది. నన్ను యుద్ధంలో చంపించాలనే కుట్రతో నన్ను రణరంగానికి పంపించింది. కానీ నేను ఆ యుద్ధంలో ఎంతోమంది శత్రువులను హతమార్చి ప్రాణాలతో తిరిగి వచ్చాను. తీరా రాజ్యానికి వచ్చాక వారిద్దరి మోసాన్ని తెలుసుకుని, భార్యతో పాటు ఆ మంత్రినీ సంహరించాను. నేను పరమ శివభక్తుడిని కావడంతో, ఆ తర్వాత తీవ్ర పశ్చాత్తాపంతో విరక్తి చెంది అడవిలోకి వెళ్లిపోయాను. అక్కడ ఏమీ తినకుండా ఆకలితో అలమటించి ప్రాణాలు విడిచాను" అని సంజయ్ దత్ పేర్కొన్నారు.

గత జన్మలో చేసిన కర్మల ఫలితమే ఈ జన్మలో తన జీవితాన్ని నిర్దేశించిందని సంజయ్ దత్ బలంగా నమ్ముతున్నారు. "గత జన్మలో శివభక్తి, పుణ్యం వల్లనే ఈ జన్మలో మంచి కుటుంబంలో జన్మించాను. మంచి జీవనశైలి, గొప్ప సినీ కెరీర్ దక్కాయి. కానీ అదే సమయంలో ఆ జన్మలో నేను చేసిన ఎన్నో హత్యల పాపానికి ఈ జన్మలో మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. అందుకే నా జీవితంలో ఇన్ని ఆటంకాలు, కష్టాలు ఎదురయ్యాయి" అని ఆయన చెప్పుకొచ్చారు.

1981లో ‘రాకీ’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన సంజయ్ దత్, ఆ తర్వాత ‘ఖల్ నాయక్’ (1993), ‘వాస్తవ్’ (1999), ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’ (2003), ‘లగే రహో మున్నాభాయ్’ (2006) వంటి విజయవంతమైన చిత్రాలతో భారతీయ చిత్రసీమలో అగ్ర నటుడిగా గుర్తింపు పొందారు.